అవిభక్త కవలలు వీణ-వాణీలు గుర్తున్నారా? ఏడాదికోసారైనా వారిని గుర్తు చేసుకుంటాం! కాసేపు జాలి చూపిస్తాం. సురక్షితంగా ఇద్దరూ విడిపోతే బాగుండని కోరుకుంటాం!
అవిభక్త కవలలు వీణ-వాణీలు గుర్తున్నారా? ఏడాదికోసారైనా వారిని గుర్తు చేసుకుంటాం! కాసేపు జాలి చూపిస్తాం. సురక్షితంగా ఇద్దరూ విడిపోతే బాగుండని కోరుకుంటాం! ఇవాళ కూడా అదే రకమైన ఆకాంక్షలను, ఆ అమ్మాయిలకు దీవెనలను అందిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ వారి 22వ బర్త్‌డే! ఆ అవిభక్త కవలలను విడదీయాలని ప్రభుత్వాలను, డాక్టర్లను తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటూనే వస్తున్నారు. వీణ వాణీ(Veena Vani)లు పుట్టినప్పటి నుంచి 13 ఏళ్లు వచ్చే రకు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రి(Nelopher Hospital) వారు తల్లిదండ్రులకు అండగా నిలిచారు. తర్వాత ఈ కవలలను హైదరాబాద్‌లోని శిశు విహార్ ( State Home)కు తరలించారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన మారగాని మురళీ-నాగలక్ష్మి దంపతులకు నలుగురు కూతుర్లు, పెద్ద కుమార్తె బింధు. రెండో సంతానంగా అవిభక్తకవలలు వీణ-వాణీ పుట్టారు. నాలుగో అమ్మాయి పేరు సింధు. 2003 అక్టోబర్ 16న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వాణి-వీణ జన్మించారు. పుట్టుకతోనే తలలు కలిసి పుట్టారు. నిరుపేద కుటుంబం కావడంతో ఈ కవలలకు గుంటూరుకు చెందిన డాక్టర్ నాయుడమ్మ ఉచితంగానే చికిత్స అందించారు. 2006లో నీలోఫర్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. ఇద్దరిని వేరు చేసేందుకు ముంబయిలోని బ్రీచ్‌కండీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మూడు నెలల పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఆపరేషన్ చేయలేమన్నారు డాక్టర్లు. పలు దేశాలకు చెందిన ప్రఖ్యాత వైద్యులు ఆపరేషన్ చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ అంత ఖర్చును భరించలేకపోతున్నారు తల్లిదండ్రులు. శస్త్రచికిత్సకు అవసరమైన ఖర్చును ప్రభుత్వం ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నా ఫలితంలేకుండా పోతోంది. ప్రస్తుతం వీణ-వాణిలు శిశు విహార్‌లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నారు. నరకయాతన అనుభవిస్తున్న తమ పిల్లలను వేరు చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.