మంత్రి శ్రీధర్‌బాబు(sreedhar babu) ఈరోజు నిర్మల్(Nirmal) జిల్లాలో పర్యటించారు.
మంత్రి శ్రీధర్‌బాబు(sreedhar babu) ఈరోజు నిర్మల్(Nirmal) జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రం నుంచి ప్రవహిస్తున్న స్వర్ణ వాగును పరిశీలించారు. స్వర్ణవాగు ఉప్పొంగిన ప్రతిసారి పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీ ముంపునకు గురవుతుంది. ఈ నేపథ్యంలో తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులు శ్రీహరిరావు తదితరులు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు దృష్టి కి తీసుకువచ్చారు. దీంతో మంత్రి శ్రీధర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి(Maheshwar reddy) ఉన్నతాధికారులతో కలిసి జీఎన్‌ఆర్ కాలనీని పరిశీలించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఇంతవరకు బాగానే ఉంది.. అధికారిక కార్యక్రమంలో బీజేపీ(BJP MLA) ఎమ్మెల్యే, ప్రభుత్వ మంత్రి పాల్గొన్నారంటే ఓకే అనుకుందాం. కానీ శ్రీధర్‌బాబు తీరుపట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఇంట్లో మధ్యాహ్న భోజనానికి(Lunch) వెళ్లడంపై విస్మయం చెందుతున్నారు. ఉదయం లేస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై(CM Revanth reddy) తీవ్ర విమర్శలు చేసే మహేశ్వర్‌రెడ్డి ఇంటికి భోజనానికి వెళ్లడంపై ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇదే విషయంపై బీఆర్‌ఎస్ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఓ వైపు వరదలు తెలంగాణను ముంచెత్తుతుంటే బీజేపీ స్పందించకపోగా.. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ చేస్తున్నారనడానికి శ్రీధర్‌బాబు ఉదంతమే కారణమని స్థానిక బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.