శుక్రవారం సాయంత్రం కవితను అరెస్ట్ చేశారనే విషయం తెలిసిన కేటీఆర్, హరీశ్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఈడీ అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కల్వకుంట్ల కవిత అరెస్టు సమయంలో ఆయన తమ విధులకు ఆటంకం కలిగించారని.. ఈడీ మహిళా అధికారి ప్రియా మీనా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కవిత అరెస్టు సమయంలో ఈడీ అధికారులపై కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్‌లో ఉండగా ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. కవితను అరెస్టు చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పి ఇప్పుడెలా ఆమెను అదుపులోకి తీసుకుంటారని అడిగారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవని తెలిసే శుక్రవారం అరెస్టు చేసేందుకు వచ్చారని కేటీఆర్ ఆరోపించారు.
శుక్రవారం సాయంత్రం కవితను అరెస్ట్ చేశారనే విషయం తెలిసిన కేటీఆర్, హరీశ్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. విచారణ ముగిసిన అనంతరం కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్ ఈడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోదాలు పూర్తయ్యాయని, అరెస్ట్ వారెంట్ ఇచ్చామని ఈడీ అధికారి భానుప్రియ మీనా చెబుతున్నారని, అలాగే అరెస్ట్ వారెంట్ ఇచ్చామని ఆమె చెబుతున్నారని అన్నారు. సోదాలు ముగిశాక కూడా ఇంట్లోకి రావొద్దని అధికారులు ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఈడీ అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.