తెలంగాణలో అరుదైన గుహలు(Caves) ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి.
తెలంగాణలో అరుదైన గుహలు(Caves) ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహలు ప్రకృతికి మరింత శోభనిస్తున్నాయి. బాహ్యప్రపంచానికి ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్న ఈ గుహలకు సందర్శకులు కూడా వస్తున్నారు. నల్గొండ(Nalgonda) జిల్లా చందంపేట దగ్గర కృష్ణానదిలోయలో గుహలు ఉన్నాయి. వీటినే 'మునుల గుహలు'(Monk Caves) అని కూడా అంటారు. చందంపేట మండలం కాచరాజుపల్లికి దగ్గర ఉన్న గుట్టల్లో నీలి ఆకుపచ్చ రంగులతో ఈ గుహలు దర్శనమిస్తున్నాయి. నీలి ఆకుపచ్చ రంగులతో ఈ గుహలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
గుహలోకి ప్రవేశించే మార్గం చాలా పెద్దగా ఉంటుంది. గుహలోపలికి అడుగుపెట్టగానే లోపల రంగు రంగుల గోడలు, ఎంతో ఎత్తుతో ఆకట్టుకుంటున్నాయి. ఎందరో నిష్ణాతులైన శిల్పులు ఉలితో చెక్కినట్లు ఇక్కడి రాతిగోడలు, వాటి అందమైన ఆకృతులు కట్టిపడేస్తాయి. గుహలోకి ప్రవేశించిన తర్వాత రాత్రి పూట ఉన్నామా అనిపిస్తుంది. అత్యాధునిక మిలుమిట్లు గొలిపే రంగు రంగుల లైట్లు ఇక్కడ అమర్చినట్లు ఉంటుంది కానీ సహజ సిద్ధంగానే ఈ రంగుల గోడలు కన్పిస్తాయి. లొపలి భాగంలో ఒకచోట ఎరుపు రంగు, మరోచోట నారింజ రంగుతోపాటు 90 శాతం వరకూ ఆక్వామెరీన్ రంగులో మిరుమిట్లు గొల్పేలా గుహ దర్శనమిస్తోంది. అయితే ఇలా రంగురంగులలతో రాతి గోడలు మెరిసేందుకు కారణం అగ్ని పర్వతంలో లావా ప్రవాహమే అని, లావా వేడికి కరిగిన వివిధ ఖనిజాలు కలిసిపోవడంతో ఈ గోడలకు అరుదైన వర్ణాలు అద్దినట్లు కనిపిస్తాయి. ఈ గుహలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే పర్యాటకులు విశేషంగా వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెప్తున్నారు. మునిగుహలకు చుట్టు పక్కన ఉన్న మునిస్వామిగుట్టలో ఉన్న జలపాతం దగ్గర దర్శనమిచ్చే శివలింగంతో పాటు మరెన్నో ఆకర్షణీయమైన ప్రకృతి అందాలు కూడా ఇక్కడ ఉన్నాయని ప్రకృతి ప్రేమికులు, స్థానికులు చెప్తున్నారు. దగ్గరలోనే వైజాగ్ కాలనీ ఉన్నందున ఇప్పటికే అక్కడికి పర్యాటకులు విశేషంగా వస్తుంటారని, అదే సమయంలో ఈ ప్రాంతం అభివృద్ధిపై దృష్టి పెడితే ఇక్కడ మరింత పర్యాటక అభివృద్ధి జరుగుతుందని వారు కోరుతున్నారు.