SLBC ఘటనపై.. సీఎం తీరు కరెక్టేనా?

SLBC ఘటనను.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నారా? సొరంగంలో పై కప్పు కూలిపోయి 8 మంది గల్లంతైన ఘటన జరిగిన 9 రోజులకు.. తీరిగ్గా వెళ్లిన ముఖ్యమంత్రి.. అవసరమైతే రోబోలతో కూడా పని చేయిస్తామని చెప్పడం.. ప్రభుత్వ నిర్లక్యానికి పరాకాష్టగానే చూడాలా? ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఎలా చూడాలి? రాజకీయం వద్దంటూనే.. అలసత్వంలాంటి తీరును ప్రదర్శిస్తున్న ఈ స్పష్టమైన వైఖరిని.. ఎలా అర్థం చేసుకోవాలి?

SLBC ఘటన జరిగి 9 రోజులు దాటింది. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తీరిక దొరికింది. సొరంగం పైకప్పు కూలి 8 మంది గల్లంతైన ఘటనపై.. ఆయన ప్రమాద స్థలానికి వెళ్లారు. ఇంతటి తీవ్రమైన ప్రమాదంపై.. అధికారులు రేయింబవళ్లు పని చేస్తూనే ఉన్నా.. సహాయ బృందాలు ట్వంటీ ఫోర్ బై సెవన్ శ్రమిస్తూనే ఉన్నా.. ఇప్పటివరకూ సీఎం వచ్చిందీ లేదు.. చూసింది అంతకన్నా లేదు. చివరికి విపక్షాల విమర్శలకు మెట్టు దిగారో.. లేదంటే సీఎంగా ఉన్న తాను ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదని అనుకున్నారో గానీ.. తీరిగ్గా SLBC ప్రమాద స్థలాన్ని సందర్శించారు. మంత్రులను వెనకేసుకుని మరీ లోపలికి వెళ్లి రెస్క్యూ చర్యలను పరిశీలించారు. ఈ క్రమంలో.. తన విజిటింగ్ వివరాలను వెల్లడిస్తూ.. అవసరమైతే సహాయ చర్యలకు రోబోల సాయం కూడా తీసుకునే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అంతా బానే ఉంది కానీ.. ప్రమాదం జరిగిన 9 రోజుల తర్వాత ఇంకా రోబోల సేవలు ఏంటి.. అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇందుకు కారణాలను కాస్త వివరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

ఆ కారణాల్లో పాయింట్ నంబర్ వన్. ఇప్పటికే సీఎం రాక లేట్ అయ్యింది. అందుకు కారణం భద్రతాపరమైన ఏర్పాట్లు, సమస్యలు అని చెప్పడం.. తప్పించుకునేందుకు సాకు మాత్రమే అవుతుంది. ఎందుకంటే.. గతంలో అనుకోని ప్రమాదాలు జరిగి పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగినప్పుడు ఆనాటి ప్రభుత్వ పెద్దలు కూడా పరామర్శకు వెళ్లని సందర్భంలో.. ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు తీవ్ర విమర్శలు చేశారు. ఇదే కాంగ్రెస్ నేతలు ఆనాడు ప్రభుత్వ వ్యవహారశైలిని దుయ్యబట్టారు. ఆ విమర్శలన్నీ.. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా.. రేవంత్ కు కూడా వర్తిస్తాయి. ఇది ఇక్కడికే వదిలేద్దాం. ఇప్పుడు పాయింట్ నంబర్ 2 డిస్కస్ చేద్దాం.

ప్రాణ నష్టం వాటిల్లకుండా.. అవసరమైతే రోబోల సేవలు తీసుకుంటాం.. అని సాక్షాత్తూ ముఖ్యమంత్రులవారే సెలవిచ్చారు. ఓకే. బానే ఉంది. టెక్నాలజీని వాడుకోవాలని భావించడం అనేది సరైన పనే. కానీ.. ఇన్నాళ్లూ ఏం చేశారు? ప్రమాదం జరిగి 9 రోజులు పూర్తవుతుంటే.. రోబోల సేవలు వాడుకోవాలన్న ఆలోచన ఇన్నాళ్లుగా ప్రభుత్వానికి ఎందుకు రాలేదు? ముఖ్యమంత్రి ప్రమాద స్థలానికి వచ్చి ఆ విషయాన్ని ప్రకటించిన తర్వాతే.. అప్పుడు కూడా రెండు మూడు రోజులు ఆగాకే.. రోబోల సేవలు వాడుకోవాలని అనుకున్నారా? అసలు ప్రమాద స్థలం దగ్గర కాకుండా.. ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశగా ఎందుకు ఇన్నాళ్లూ ఆదేశాలు ఇవ్వలేకపోయారు? దీనికి ఎవరు సమాధానం చెబుతారు?

ఇది కూడా వదిలేద్దాం. పాయింట్ నంబర్ 3 ఏంటో పరిశీలిద్దాం. ప్రాణ నష్టం అన్నది లేకుండా.. అని కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి.. ఓ మాట మాట్లాడారు. ఇప్పుడు కూడా సేమ్ పాయింట్. ఘటన జరిగి 9 రోజులు అవుతోంది. సొరంగం లోపల ప్రమాద స్థలంలో 70 శాతం బురద.. మిగతా 30 శాతం నీరు ఉన్నాయని.. అడుగు వేయడం సంగతి పక్కన పెటిదే.. కాలు కదపడానికే అవకాశం లేకుండా పోతోందని రెస్క్యూ బృందాలు ఇప్పటికే పదే పదే చెబుతున్నాయి. రాడార్ల సహాయంతో కష్టంగా లోపలికి వెళ్తున్నా.. సొరంగాన్ని జల్లెడ పడుతున్నా.. ఫలితం లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో.. తమ వారి ఆచూకీపై కుటుంబీకులు కూడా ఆశలు వదిలేసుకుంటున్నారని ఎవరు అవునన్నా కాదన్నా.. వాస్తవమైన విషయం. అలాంటిది.. ప్రాణ నష్టం తలెత్తకుండా.. అన్న మాటను సీఎం అన్నారంటే.. దీన్ని మభ్యపెడుతున్నారని అనుకోవాలా.. లేదంటే తమవైపు తప్పు లేదని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని భావించాలా?

సరే. ఇది కూడా వదిలేసి ఇప్పుడు పాయింట్ నంబర్ 4 చూద్దాం. ఈ విషయంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రాజకీయాలు వద్దన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలన్నారు. బురద రాజకీయాలు వద్దంటూ పిలుపునిచ్చారు. గుడ్. బాగుంది. చాలా బాగుంది. కానీ.. అక్కడితో ఆగని సీఎం.. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి.. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు గురించి.. చాలానే విమర్శలు చేశారు. అది కూడా సరే అనుకుందాం. కానీ.. మేడిగడ్డ ఘటనకు, SLBC ఘటనకు పోలిక పెట్టి రేవంత్ చేసిన కామెంట్లను బాధ్యతారాహిత్యం కంటే పెద్ద పదాలతో వర్ణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. మేడిగడ్డ ఘటన ఏమో నిర్లక్ష్యం, నాణ్యతాలోపం వల్ల జరిగిందట. SLBC ఘటన.. పూర్తిగా విపత్తు లాంటిదట. ఇది విన్న వెంటనే.. ఇదేందయ్యా ఇదీ.. ఇది నేను చూడలా.. అని అనాలనిపించి.. అనలేక.. ముఖ్యమంత్రి మీద గౌరవంతో మౌనంగా ఉండాల్సి వస్తోంది.

అప్పుడేమో ప్రభుత్వ నిర్లక్ష్యమై.. ఇప్పుడు మాత్రం విపత్తు జరిగినట్టైతే.. ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ప్రమాదం ఏది జరిగినా సరే.. అది విపత్తుగానే తీసుకోవాలా.. అన్న ప్రశ్న కూడా.. సమాధానాన్ని వెతుక్కోమంటూ వెక్కిరించేలా జనాన్ని వెంటాడుతోంది. ఇలా మాట్లాడుకుంటూ పోతే.. ఇంకా చాలా పాయింట్లు.. ఈ ఘటన గురించి ప్రస్తావించాల్సి వస్తుంది. కానీ.. రేవంత్ పర్యటన, ప్రసంగం తీరు చూసి.. విపత్తుగా మారిన ఈ ప్రమాదం గురించి అర్థం చేసుకుని.. అవగాహన పెంచుకుని.. ఆపై నోరు మూసుకుని.. గల్లంతైన ఆ 8 మంది గురించి ఎదురుచూడడం తప్ప.. మరేదీ చేయలేమని జనాలు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. త్వరగా.. వాళ్ల ఆచూకీపై స్పష్టత రావాలని కోరుకుంటున్నారు.

ehatv

ehatv

Next Story