తెలంగాణ గ్రామీణ వాసులకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు.
ఒక వైపు హైపర్ లూప్ ల గురించి చర్చ జరుగుతున్న ఈ దేశంలోనే.. కనీస రోడ్డు సౌకర్యాలు లేని గ్రామాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో కూడా ఇప్పటికీ కొన్ని గ్రామాలు రోడ్డు లేకుండా రవాణా సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్నాయి. ఇక ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరకనుంది. రేవంత్ రెడ్డి తాజా ఆదేశాలు పరిష్కారం దిశగా అడుగుపడేలా చేశాయి.
ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ శాఖల రివ్యూలో పాల్గొన్న ముఖ్య మంత్రి ప్రతి గ్రామానికి రోడ్డు వేయాలని చెప్పారు. అటవీ ప్రాంతంలో ఉండే గ్రామాలకు కూడా రహదారులు ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం కోసం ఆర్థిక శాఖ నుండి 1000 కోట్ల రూపాయలు కేటాయించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రతి నెలా 150 కోట్ల రూపాయల చొప్పున జూన్ నెల వరకు పూర్తి బడ్జెట్ రిలీజ్ చేస్తూ.. రహదారుల నిర్మాణం పూర్తి చేయాలి అని చెప్పారు.
గత ప్రభుత్వంలో ప్రత్యేక గ్రామ పంచాయితీ లు ఏర్పాటు చేశారు. తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా మార్చారు. కానీ రోడ్డు సౌకర్యాలు మాత్రం ఏర్పాటు చేయలేదని అన్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం కార్లు, బైక్ లు తిరగడానికి అనువుగా రోడ్ వెడల్పును రిసైజ్ చేసి, కొత్త రోడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.