పారిస్ 2024 పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన

పారిస్ 2024 పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన రాష్ట్ర క్రీడాకారిణి దీప్తి జీవన్‌జీకి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోటి రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. నగదు బహుమతితో కాకుండా దీప్తికి గ్రూప్-2 ప్రభుత్వ ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నారు. ఆమె విజయానికి కోచ్ చేసిన కృషికి గుర్తింపుగా సీఎం ఆమెకు రూ.10 లక్షల బహుమతిని కూడా అందజేశారు. ఈ రివార్డులను సత్వరమే అందేలా చూడాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.

"ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ పారాలింపిక్స్ 2024లో పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ జీవాంజి దీప్తి గారిని ముఖ్యమంత్రి @revanth_anumula గారు సత్కరించారు. విశ్వ వేదికపై సత్తా చాటిన పారా అథ్లెట్ దీప్తి గారికి గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, 1 కోటి రూపాయల నగదు బహుమానం, వరం‌గల్‌లో 500 గజాల స్థలం, కోచ్ నాగపురి రమేష్ గారికి రూ. 10 లక్షలు బహుమతిగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇటీవల పారిస్ వేదికగా జరిగిన #Paralympics2024 మహిళల 400 మీటర్ల టీ20 రేసులో జీవాంజి దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. పారా అథ్లెట్స్, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేలా, వారికి అవసరమైన ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు." అంటూ తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది.



దీప్తి జీవితంలో ఎన్నో అవమానాలు, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె తల్లిదండ్రులు జీవన్‌జీ యాదగిరి, జీవన్‌జీ ధనలక్ష్మి రోజువారీ కూలీ పనులు చేసుకునేవారు. వారికి ఉన్న అర ఎకరం వ్యవసాయ భూమిని కూడా అమ్ముకుని బతకాల్సి వచ్చింది. దీప్తిని ఎంతో మంది ఎగతాళి చేశారు. ఇంట్లో పెట్టుకోకండి, అనాథాశ్రమానికి పంపాలని కూడా కొందరు సూచించారు. అయినప్పటికీ, ఆమె తల్లిదండ్రులు ఆమెకు అండగా నిలిచారు. వారి మద్దతు ఆమె విజయంలో కీలక పాత్ర పోషించింది.


Sreedhar Rao

Sreedhar Rao

Next Story