సీఎం ఈటల జపం వెనుక కారణమేంటి ? మైండ్ గేమ్‌లో భాగం మాత్రమేనా ? వ్యూహం ప్రకారమే పేరు ప్రస్తావించారా ? పదే పదే ‘మిత్రుడు ఈటల రాజేందర్‌ చెప్పినట్లు’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించడంలో ఆంతర్యమేంటి..? బీజేపీ ఎమ్మెల్యే ఈటల తిరిగి బీఆర్ఎస్ లో చేర్చుకుంటారన్న ప్రచారంలో నిజమెంత? ఈటల పేరు ప్రస్తావించే సమయంలో ఘర్‌ వాపసీ అంటూ అసెంబ్లీలో నినాదాలు వినిపించడం వెనుక మతలబేంటి..? కేసీఆర్ 2 గంటల ప్రసంగంలో ఏకంగా 10 సార్లు ఈటల […]

సీఎం ఈటల జపం వెనుక కారణమేంటి ? మైండ్ గేమ్‌లో భాగం మాత్రమేనా ? వ్యూహం ప్రకారమే పేరు ప్రస్తావించారా ? పదే పదే ‘మిత్రుడు ఈటల రాజేందర్‌ చెప్పినట్లు’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించడంలో ఆంతర్యమేంటి..? బీజేపీ ఎమ్మెల్యే ఈటల తిరిగి బీఆర్ఎస్ లో చేర్చుకుంటారన్న ప్రచారంలో నిజమెంత? ఈటల పేరు ప్రస్తావించే సమయంలో ఘర్‌ వాపసీ అంటూ అసెంబ్లీలో నినాదాలు వినిపించడం వెనుక మతలబేంటి..? కేసీఆర్ 2 గంటల ప్రసంగంలో ఏకంగా 10 సార్లు ఈటల పేరును ప్రస్తావించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ బడ్జెట‌ సమావేశాల్లో చివరి రోజు అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రెండు గంటలకు పైగా అసెంబ్లీలో ప్రసంగించారు. రాష్ట్ర బీజేపీ నాయకులతోపాటు ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. కానీ.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మాత్రం ‘మిత్రుడు ఈటల రాజేందర్‌ చెప్పినట్లు’ అంటూ సంబోధిస్తూనే ఆయన లేవనెత్తిన డిమాండ్ల పట్ల కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. డైట్ చార్జీలు పెంచాలని కోరిన ఈటల డిమాండ్‌కు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని హరీష్‌రావును ఆదేశించారు. ఈటలను సంప్రదించి వివరాలు తీసుకోవాలని హరీష్‌రావుకు సూచించారు. అసెంబ్లీలో ఈటల పేరును సీఎం కేసీఆర్‌ పదేపదే ప్రస్తావించడంతో అందరినీ ఆలోచనలోపడేసింది. రెండు గంటలపాటు కొనసాగిన సీఎం కేసీఆర్ ప్రసంగంలో ఏకంగా 10 సార్లకుపైగా ఈటల పేరు ఉచ్చరించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కేసీఆర్‌ మాట్లాడిన మాటల వెనుక ఏదో బలమైన కారణం ఉండకపోలేదంటూ గుసగుసలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన మరో పరిణామం కూడా ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌లో చేరతారనే వార్తలకు కారణమైంది.

ఫిబ్రవరి 3న తెలంగాణ శాసనసభ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అసంబ్లీ సమావేశం మొదలు కావడానికి ముందు మంత్రి కేటీఆర్‌ విపక్ష సభ్యులందరినీ పలకరించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తో రెండుసార్లు ప్రత్యేకంగా మాటామంతీ జరిపారు. ఇటీవల హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంటలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి ప్రొటోకాల్‌ అంశం వీరి మధ్య చర్చకు వచ్చింది. ‘‘అధికారిక కార్యక్రమానికి ఎందుకు రాలేదు?’’ అని మంత్రి కేటీఆర్‌.. ఈటలను ప్రశ్నించగా, ‘పిలిస్తే కదా హాజరయ్యేది!’ అంటూ ఈటల బదులిచ్చారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పద్ధతి సరిగ్గా లేదని ఈటల రాజేందర్‌ ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో అన్నారు. ఆ సమయంలో ఈటల వెనకాలే ఉన్న కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఎంట్రీ అయి.. ఈటల నెత్తిని నిమురుతూ కనిపించారు. తనను గెంటేశారని బీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై దుమ్మెత్తిపోసి మరీ బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌తో కేటీఆర్ అంత సన్నిహితంగా మెలగడం చూసి ఈటల మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.

తాజాగా బడ్జెట్ సమావేశాల చివరి రోజు (ఆదివారం) అసెంబ్లీలో కేసీఆర్ పదేపదే ఈటల పేరును ప్రస్తావించడం ఈ ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. అయితే ప్రస్తుతం ఈటల రాజేందర్ బీజేపీలో చేరికల కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. చేరికల కమిటీ చైర్మన్ గా నియమించినప్పటికీ ఈటల రాజేందర్‌ వెంట చెప్పుకోదగ్గ స్థాయిలో నేతలు బీజేపీలోచేరలేదు. దీనిపై ఈటల అసహనం వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది. చేరికల కమిటీ ఉంటుందా ? అవసరమా ? అన్ని రాజకీయ పార్టీల్లో కేసీఆర్‌ కోవర్టులు ఉన్నారంటూ ఈటల చేసిన కామెంట్స్‌ పార్టీ అధినాయకత్వం వరకు చేరాయి. త్వరలోనే రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటల రాజేందర్‌కు దక్కుతుందనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవీ కాలాన్ని పొడిగించడంతో.. ఇక్కడ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ పదవీ కాలాన్ని పొడగిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పదవీ రేసులోకి వచ్చిన ఈటల రాజేందర్‌ను ఒక్కసారిగా అయోమయంలో పడేశారు సీఎం కేసీఆర్‌.

మరోవైపు అసెంబ్లీ మాత్రం ఈటల రాజేందర్‌ పేరును పదే పదే ప్రస్తావించడం వెనక కారణాలపై బీజేపీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈటలను దెబ్బతీసే విధంగా మాట్లాడి ఉంటారని కమలనాథులు భావిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో కేసీఆర్‌కు కోవర్టులు ఉంటారని ఇటీవల ఈటల రాజేందర్‌ చేసిన కామెంట్స్‌ కాషాయ పార్టీలోకి మరోవర్గం నేతలు గుర్తు చేస్తున్నారు. ఎవరు మిత్రులు ? ఎవరు శత్రువులు ? ఎవరు కోవర్టులు ? తెలియని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే.. కేసీఆర్‌ పదేపదే తన పేరు ప్రస్తావించడంపై ఈటల స్పందించారు. తనను డ్యామేజ్‌ చేసే వ్యూహంతోనే కేసీఆర్‌ అలా మాట్లాడారని ఆరోపించారు. BRSలో తిరిగి చేరేది లేదని ఈటల కుండబద్ధలు కొట్టి చెప్పారు. తనది పార్టీ మారే చరిత్ర కాదని, గెంటేసినవాళ్లు పిలిచినా పోనని ఈటల తెగేసి చెప్పారు. మొత్తంగా చూసుకుంటే.. ఈటల బీజేపీలోనే కీలక నేతగా ఎదిగే దిశగా అడుగులేస్తున్నారని తాజా పరిణామాలతో స్పష్టమైంది.

Updated On 14 Feb 2023 6:57 AM GMT
Ehatv

Ehatv

Next Story