తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు సీట్లు కు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.
రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి లను బిఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ ప్రకటించారు.వీరిని ఈ నెల 9వ తేదీన నామినేషన్ వేయాల్సిందిగా సిఎం కేసీఆర్ సూచించారు.ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిలను సిఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా... రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా 2017లో ఎన్నికైన ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్ ల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఆ లోగా కొత్త సభ్యుల నియామకం జరగాల్సి ఉంది. తెలంగాణలో ఖాళీ అవుతోన్న ఎమ్మెల్యే కోటాలోని 3 శాసన మండలి స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన పార్టీ అధినేత కేసీఆర్ ఎట్టకేలకు ముగ్గురి పేర్లను ఖరారు చేశారు.
షెడ్యూల్ ప్రకారం, మార్చి 6న తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మార్చి 13 వరకు నామినేషన్లు దాఖలుకు అవకాశం ఇవ్వగా, మార్చి 14న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు మార్చి 16 వరకు గడువు ఇచ్చారు. ఆయా స్థానాలకు ఒకరికన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే.. మార్చి 23న పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓట్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. పోలైన ఓట్లను అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి లెక్కించి, విజేతను ప్రకటిస్తారు. మార్చి 25 లోగా ఎన్నికలను పూర్తి చేస్తారు. అయితే సంఖ్యా పరంగా చూస్తే మూడు స్థానాలు బీఆర్ఎస్ కే దక్కే అవకాశాలు ఉన్నాయి.