Chandrayangutta Constituency : చాంద్రాయణ గుట్ట-అక్బరుద్దీన్ కోట, మళ్లీ విజయం సాధిస్తాడా.!
హైదరాబాద్ ఘన చరిత్రకు ఆనవాలుగా నిలిచేది పాతబస్తీ. పాతబస్తీ (Old City) రాజకీయాల్లో సంచలనాల కేంద్రం చాంద్రాయణగుట్ట (Chandrayangutta). ఎన్ని పార్టీలు పోటీ చేసినా..చంద్రాయణగుట్టలో మజ్లిస్ పార్టీదే ఆధిప్యతం. మైనార్టీ ఓట్లకు హక్కుదారుగా పాతుకుపోయిందీ మజ్లిస్ పార్టీ. పాతబస్తీలో ఏకపక్ష రాజకీయాలు చెల్లవని ఎంఐఎంకు వార్నింగ్ ఇచ్చిన చాంద్రాయణగుట్ట..ఇప్పుడు మజ్లిస్ పార్టీకి కంచుకోటగా మారింది. హిందువుల ఓట్లు గణనీయంగా ఉన్నా మరో పార్టీ ఎందుకు గెలవలేకపోతోంది. ఈసారి కూడా షరా మామూలేనా? చాంద్రాయణగుట్టలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.
హైదరాబాద్ ఘన చరిత్రకు ఆనవాలుగా నిలిచేది పాతబస్తీ. పాతబస్తీ (Old City) రాజకీయాల్లో సంచలనాల కేంద్రం చాంద్రాయణగుట్ట (Chandrayangutta). ఎన్ని పార్టీలు పోటీ చేసినా..చంద్రాయణగుట్టలో మజ్లిస్ పార్టీదే ఆధిప్యతం. మైనార్టీ ఓట్లకు హక్కుదారుగా పాతుకుపోయిందీ మజ్లిస్ పార్టీ. పాతబస్తీలో ఏకపక్ష రాజకీయాలు చెల్లవని ఎంఐఎంకు వార్నింగ్ ఇచ్చిన చాంద్రాయణగుట్ట..ఇప్పుడు మజ్లిస్ పార్టీకి కంచుకోటగా మారింది. హిందువుల ఓట్లు గణనీయంగా ఉన్నా మరో పార్టీ ఎందుకు గెలవలేకపోతోంది. ఈసారి కూడా షరా మామూలేనా? చాంద్రాయణగుట్టలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.
హైదరాబాద్ పాతబస్తీ సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువు. ఒకప్పుడు ఎంఐఎంకి ముచ్చెమటలు పట్టించిన చరిత్ర కూడా ఈ నియోజకవర్గానిది. ఎంఐఎం అధినేత సలావుద్దీన్ ఒవైసీ రాజకీయాలను సవాల్ చేస్తూ పాతబస్తీ రాజకీయాలను మార్చేసింది ఎంబీటీ. సలార్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ముస్లింల్లో తిరుగుబాటు తెచ్చిన ఎంబీటీ పార్టీని గెలిపించింది ఈ నియోజకవర్గమే. 1952లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎక్బోటే గోపాల్‌రావు గెలిచారు. కానీ 1978 నుంచి చాంద్రాయణగుట్ట మజ్లిస్ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. ఆ ఎన్నికల్లో ఎంఐఎం(MIM) నుంచి పోటీచేసిన అమానుల్లాఖాన్ గెలవడంతో మజ్లిస్ కు తిరుగులేకుండాపోయింది. ఆ తర్వాత జరిగిన 1983, 1985, 1989 ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థిగా అమానుల్లాఖాన్ జైత్రయాత్ర కొనసాగించారు.
ఆ తర్వాత ఎన్నో పదవులు అధిష్టించి, కీలక నేతగా ఎదిగిన అమానుల్లాఖాన్..ఆ తర్వాత పార్టీపై తిరుగుబాటు చేశారు. ఎంఐఎంలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆరోపణలకు దిగారు. 1993లో మజ్లీస్ బచావో తెహరిక్ పార్టీని స్థాపించారు. పాతబస్తీలో తిరుగులేని ఎంఐఎం అధినేత ఓవైసీకి వ్యతిరేకంగా బలమైన రాజకీయం నడిపి, 1994లో జరగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంను ఓడించారు. పాతబస్తీలో ఎంఐఎంను కేవలం చార్మినార్ అసెంబ్లీ సీటుకే పరిమితం చేశారు. ఆ తర్వాత సలావుద్దీన్ వ్యూహం, ఒవైసీ చిన్న కుమారుడు అక్బరుద్దీన్ రాజకీయ అరగేట్రంతో 1999 ఎన్నికల్లో అమనుల్లాఖాన్ ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి పాతబస్తీ రాజకీయాల్లో ఏంఐఎంకు తిరుగులేకుండాపోయింది. చంద్రాయణగుట్ట నుంచి ఐదోసారి గెలిచిన అక్బరుద్దీన్ ఒవైసీ..మరోసారి బరిలోకి దిగుతున్నారు.
పూర్తిగా పాతబస్తీలో అంతర్భాగంగా ఉన్న చంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 8 డివిజన్లు ఉన్నాయి. చాంద్రాయణగుట్ట, బార్కాస్, బండ్లగూడ, మొయిన్ బాగ్ జంగమ్మెట్, రక్షాపురం, ఈడి బజార్, ఉప్పుగూడ ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మొత్తం 2 లక్షల 63 వేల 278 మంది ఓటర్లు ఉండగా, హిందూ ఓటు బ్యాంకు కూడా బాగానే ఉన్నప్పటికీ..ముస్లింల ఓట్లే నియోజక వర్గాల్లో నిర్ణయాత్మకంగా ఉన్నాయి. ముఖ్యంగా చంద్రాయణగుట్ట, జంగమ్మెట్, రక్షా పురం, ఉప్పుగూడల్లో హిందూ ఓట్లు ఎక్కువ. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ తమ అభ్యర్థులుగా హిందువులను రంగంలోకి దింపడంతో ఓట్లు చీలిపోయి ఎంఐఎం ఈజీగా గెలుస్తోంది. ఎంఐఎం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు తెచ్చుకున్న అక్బరుద్దీన్ ఒవైసీ తిరుగులేని నేతగా పట్టుసాధించారు. అక్బరుద్దీన్ తనకు తాను తప్పుకుంటే తప్పా ఇక్కడ మరో అభ్యర్థి గెలిచే అవకాశం లేనట్లు మారింది పరిస్థితి.
ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS), టీడీపీ(TDP) నాలుగు పార్టీలు పోటీ చేస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీతోపాటు ప్రస్తుత అధికార పార్టీ బీఆర్ఎస్తోనూ ఎంఐఎంకి లోపాయికారి సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఆ పార్టీలు అక్బరుద్దీన్‌పై బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దించుతాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా షాహేజాది సయ్యద్ అనే మైనార్టీ మహిళా మోర్చ నేతను రంగంలోకి దింపింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 15 వేలకు పైగా ఓట్లను వచ్చాయి. ఆ తర్వాత షాహేజాదికి బీజేపీ ఏకంగా జాతీయ మైనార్టీ మహిళా కమిషన్ మెంబర్ పదవి ఇచ్చింది. ఈసారి కూడా ఆమె చంద్రాయణ్ గుట్ట అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
అధికార పార్టీ బీఆర్ఎస్ ఈ నియోజకవర్గం నుంచి సీరియస్‌గా పోటీచేస్తుందా, లేదా? అన్న చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎం. సీతారాం రెడ్డికి 14 వేల 227 ఓట్లు వచ్చాయి. ఎంఐఎం వ్యవహార శైలిపై కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది. ఒకప్పుడు తమ సహకారంతో రాజకీయంగా ఎదిగి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంపై రివేంజ్ తీసుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఈసారి బీసీ నేత బోయే నగేష్ టికెట్ కేటాయించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఈసా మిస్త్రీకి 11 వేల 310 ఓట్లు వచ్చాయి. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది వేచి చూడాల్సిందే. ఇక గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ఎంబీటీ మళ్లీ ఎంఐఎంను ఎదుర్కొనే పరిస్థితి కనిపించడం లేదు.
పాతబస్తీ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఎంఐఎంను ఓడించడమంటే మిగిలిన పార్టీలకు అంత ఈజీ కాదనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. మైనార్టీ ఓట్లపై పట్టులేకపోవడంతో ప్రధాన పార్టీలు కూడా ఇక్కడి నుంచి నామ్‌కే వాస్తే పోటీకే పరిమితం అవుతున్నాయి. గెలుపు సంగతి పక్కన పెడితే.. ద్వితీయ స్థానం కోసమే పార్టీలు పోటీపడుతున్నట్టుగా కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.