శిల్పారామం మార్గంలోని మాదాపూర్ పరిధిలోకి వచ్చే కొన్ని వేల కోట్ల విలువైన భూమిని చంద్రబాబు ప్రభుత్వం స్వల్ప ధరకు అప్పగించింది
ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబునాయుడు ఉన్నప్పుడు ఐఎంజీభరతకు రాసిచ్చిన భూములపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్‌లో ఎంతో విలువైన భూములు, స్టేడియాలను ఐఎంజీభరత అనే సంస్థకు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పగించేందుకు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన కేసులో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. భూముల రిజిస్ట్రేషన్లను ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రద్దుచేసిన తర్వాత ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీసింది. ఒక ప్రైవేటు కంపెనీకి అడ్డగోలుగా భూములను అప్పగించారని చెప్పి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం, ఆ తర్వాత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. భూములను ఏకపక్షంగా అప్పగించటానికి ప్రయత్నించిన దోషులు ప్రభుత్వంలోనే ఉన్నారని వ్యాఖ్యానించింది. ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌తో రాష్ట్ర(చంద్రబాబు) ప్రభుత్వం 2003 ఆగస్టు 9న 850 ఎకరాలు కేటాయించేలా ఎంవోయూ కుదుర్చుకుంది. అంతకు ముందు కేవలం 5 రోజుల ముందే 2003, ఆగస్టు 5న కంపెనీ ఏర్పాటైంది. అలాంటి కంపెనీకి ఎలాంటి టెండర్లు, బిడ్డింగ్ లేకుండా బంజారాహిల్స్ నుంచి శిల్పారామం మార్గంలోని మాదాపూర్ పరిధిలోకి వచ్చే కొన్ని వేల కోట్ల విలువైన భూమిని చంద్రబాబు ప్రభుత్వం స్వల్ప ధరకు అప్పగించింది. యువజన, సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు నాటి ముఖ్యమంత్రి(చంద్రబాబు)తో కలిపి 6 దశల ఐఎంజీబీ ఒప్పందానికి ఆగమేఘాల మీద ఒక్కరోజులోనే అన్ని అనుమతులు జారీ చేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకీ చెందిన 450 ఎకరాలు, ఐఎంజీ అకాడమీ ఆఫ్ భరత ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్ కోసం జూబ్లీహిల్స్‌లో ఐదెకరాలు కలిపి మొత్తం 850 ఎకరాలతో పాటు హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన పలు స్టేడియాలను ఐఎంజీ సంస్థకు అప్పగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2003 ఆగస్టు 9న ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దుచేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ భరత దాఖలుచేసిన పిటిషన్, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని దాఖలైన మరో రెండు వ్యాజ్యాలను కలిపి గురువారం హైకోర్టు విచారించింది. ఈ నెల 28న జరిగే విచారణ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకొన్నారనే వివరాలు అందజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ జే అనిల్ కుమార్‌తో కూడిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.