మాధవి లత వివాదాస్పద చర్యలపై ఎన్నికల సంఘం మౌనంగా ఉందంటూ

బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత రామ నవమి ఊరేగింపు సందర్భంగా మసీదుపై ఊహాజనిత బాణం వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మాధవి లత తన చేతులను బాణం వేసినట్లుగా చూపించారు. మనోభావాలను దెబ్బతీశారనే ఫిర్యాదుపై హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదయింది. సిటీలోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదయింది.

ఏప్రిల్ 17న శ్రీరామనవమి శోభాయాత్రలో పాల్గొన్న మాధవి లత.. సిద్ది అంబర్ బజార్ సర్కిల్ వద్ద ఉన్న మసీదు వైపు బాణం గురిపెట్టి వదులుతున్నట్టు ఊహాజనిత సంజ్ఞ చేశారని ఇమ్రాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదు చేశారు. ఐపీసీలోని 295-ఏ , ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125 వంటి సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

మాధవి లత వివాదాస్పద చర్యలపై ఎన్నికల సంఘం మౌనంగా ఉందంటూ ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా తప్పుబట్టారు. అయితే వీడియో కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు కోరుతున్నానని మాధవీలత వివరణ ఇచ్చారు. “నాకు సంబంధించిన వీడియోను మీడియాలో ప్రచారం చేస్తూ నెగిటివిటీని సృష్టించడం నా దృష్టికి వచ్చింది. ఇది అసంపూర్ణ వీడియో అని, అలాంటి వీడియో వల్ల ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటాయని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను వ్యక్తులందరినీ గౌరవిస్తాను కాబట్టి క్షమాపణలు కోరుతున్నాను" అని ఆమె X లో పోస్ట్‌ పెట్టారు.

Updated On 21 April 2024 9:23 PM GMT
Yagnik

Yagnik

Next Story