ప్రజాకవి, పద్మవిభూషణుడు కాళోజీ నారాయణరావు(Kaloji Narayana Rao) జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆయనను స్మరించుకున్నారు.
ప్రజాకవి, పద్మవిభూషణుడు కాళోజీ నారాయణరావు(Kaloji Narayana Rao) జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ భాష(Telangana language) బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ అని కేటీఆర్ అన్నారు. ఎక్స్ వేదికగా ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'మన కాళోజీ 'గొడవ' ప్రజల గొడవ. తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ. అచ్చమైన తెలంగాణ వాడుక భాషలో కాళోజీ నారాయణరావు గారు చేసిన రచనలు మాటల తూటాలు. నిరంకుశత్వంపై, అరాచక పాలనపై, అసమానతలపై విమర్శనాస్త్రాలు.
ప్రతినిత్యం సామాన్యుల సమస్యలనే, హక్కుల పరిరక్షణే, ప్రజా శ్రేయస్సునే తన జీవితంగా భావించిన తెలంగాణ వైతాళికుడు కాళోజీ.
ప్రజాకవిగా పేరొందిన కాళోజీ స్వాతంత్ర్య సమరయోధునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా అందించిన స్ఫూర్తి, చేసిన సేవలు అనిర్వచనీయం.
మన కాళన్న గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే మహోన్నత ఉద్దేశంతోనే కేసీఆర్ గారు కాళోజీ గారి జయంతిని (సెప్టెంబర్ 9) తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారు. వైద్య విశ్వవిద్యాలయానికి వారి పేరు పెట్టారు. వరంగల్‌లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారు.
ధిక్కార స్వరం కాళోజీ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం.
కాళోజీ కలం.. సామాన్యుల గళం.. ప్రజలకు బలం.
నేడు కాళోజీ నారాయణరావు గారి జయంతి.
ఆ మహనీయునికి నివాళులు
తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు!' అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు కేటీఆర్.