తెలుగు రాష్ట్రాల సరిహద్దుజిల్లా సూర్యాపేట(Suryapet). ఎంతో మంది మహానుభావులు, మేధావులు పరిపాలించిన చరిత్ర కలిగిన జిల్లా సూర్యాపేట. ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచి మంత్రి అయిన జగదీష్‎రెడ్డి(Jagadish Reddy).. హ్యాట్రిక్ మీద కన్నేశారు. గత రెండు ఎన్నికల్లోనూ బోటాబోటీ మెజార్టీతో బయటపడ్డ జగదీష్‎రెడ్డి.. ముచ్చటగా మూడోసారి గులాబీ జెండాను ఎగరేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల సరిహద్దుజిల్లా సూర్యాపేట(Suryapet). ఎంతో మంది మహానుభావులు, మేధావులు పరిపాలించిన చరిత్ర కలిగిన జిల్లా సూర్యాపేట. ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచి మంత్రి అయిన జగదీష్‎రెడ్డి(Jagadish Reddy).. హ్యాట్రిక్ మీద కన్నేశారు. గత రెండు ఎన్నికల్లోనూ బోటాబోటీ మెజార్టీతో బయటపడ్డ జగదీష్‎రెడ్డి.. ముచ్చటగా మూడోసారి గులాబీ జెండాను ఎగరేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. మూడోసారి జగదీష్ రెడ్డిని అదృష్టం వరిస్తుందా? కాంగ్రెస్ తలరాత మారుతుందా? కమలనాథుల వ్యూహం ఏమిటి? పేట ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? రానున్న ఎన్నికల్లో సూర్యాపేటలో కనిపించబోయే సీనేంటి? మీ నియోజకవర్గం.. మా విశ్లేషణలో చూద్దాం.

ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ నమ్మిన బంటుగా ఉన్న జగదీష్‎రెడ్డికి సీఎం కేసీఆర్ అప్పట్లో సూర్యాపేట భాద్యతలు అప్పగించారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తరుణంలో కేసీఆర్ సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా జగదీష్ రెడ్డిని ఖరారు చేశారు. 2014 ఎన్నికల్లో సూర్యాపేట నుంచి పోటీ చేసి, 2219 ఓట్ల మెజార్టీతో స్వతంత్ర అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు మీద గెలుపొందారు. సంస్థాగతంగా కాంగ్రెస్ బలంగా ఉన్న సూర్యాపేటలో వరుసగా రెండుసార్లు బొటాబొటి మెజార్టీతో గట్టెక్కారు మంత్రి జగదీశ్‌రెడ్డి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న జగదీశ్‌రెడ్డికి పార్టీలో అంతర్గత సమస్యలు సవాల్‎గా మారుతున్నాయి. అటు కాంగ్రెస్‌ పార్టీలోనూ ఇంచుమించు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సారి సూర్యాపేటలో ఏ జెండా ఎగురుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారిధిగా నిలుస్తోంది సూర్యాపేట నియోజకవర్గం. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఉన్న సూర్యాపేట పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రధాన కేంద్రంగా ఉన్న సూర్యాపేట నుండి ఎందరో ప్రముఖ నేతలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 1952లో సూర్యాపేట నియోజకవర్గం ఏర్పాటు కాగా.. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. మొదటి నాలుగు సార్లు వామపక్ష పార్టీ నేతలు ఎమ్మెల్యేలుగా గెలిస్తే.. ఆ తర్వాత ఐదు సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీడీపీ గెలుపొందాయి. గత రెండుసార్లు వరుసగా బీఆర్ఎస్ విజయం సాధించింది. జిల్లా కేంద్రంగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత సూర్యాపేట రూపురేఖలే మారిపోయాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చిన్న పట్టణంగా ఉన్న సూర్యాపేటను జగదీష్‎రెడ్డి మంత్రి అయిన తర్వాత జిల్లాగా మార్చారు. తొమ్మిదిన్నర ఏండ్లకాలంలో దాదాపు 5 వేల కోట్లకుపైగా నిధులతో మెడికల్ కాలేజ్ మొదలు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని జగదీష్‎రెడ్డి చెబుతున్నారు.

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉన్న సూర్యాపేట.. 2009లో పునర్విభజన తర్వాత జనరల్‌గా మారింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(Ram Reddy Damodar Reddy) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుండి బీఆర్ఎస్ హవా మొదలైంది. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా మంత్రి జగదీష్‎రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా, మొత్తం 2 లక్షల 35 వేల 323 మంది ఓటర్లు నమోదయ్యారు. గత రెండు ఎన్నికల్లోనూ మంత్రి స్వల్ప మెజార్టీతోనే గెలిచారు. 2014లో కేవలం రెండు వేల రెండు వందల ఓట్లు, గత ఎన్నికల్లో ఐదు వేల 9 వందల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు జగదీష్‎రెడ్డి. మంత్రి ప్రధాన అనుచరుడిగా ఉన్న వ్యక్తి ఆగడాలపై ఇటీవల కాలంలో ఫిర్యాదులు పెరిగిపోవడం బీఆర్ఎస్‌కు ప్రతికూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫిర్యాదులతో అతడిని మంత్రి దూరం పెట్టగా.. అతను జగదీష్‎రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఏదేమైనా తాను చేసిన అభివృద్ధే మళ్లీ గెలిపిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు మంత్రి.

మొదట్లో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న సూర్యాపేటలో రానురాను కాంగ్రెస్ బలపడింది. ఇప్పటికీ ఆ పార్టీకి సంస్థాగతంగా మంచి బలం ఉంది. కానీ నేతల్లో ఐక్యత లేక 2014, 18 ఎన్నికల్లో రెండుసార్లు ఓటమిని మూటగట్టుకుంది. సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి 2009లో సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆయన ఓటమి చవి చూశారు. ఈ సారి దామోదర్రెడ్డికి పోటీగా మరో సీనియర్ నేత పటేల్ రమేశ్ రెడ్డి(Patel Ramesh Reddy) టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఈ ఇద్దరూ టికెట్ కోసం పోటీపడ్డారు. అయితే అప్పుడు టిక్కెట్ దామోదర్ రెడ్డికే దక్కింది. ఈ ఇద్దరు నేతల మధ్య గ్రూపు తగాదాల వల్లే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ సారి ఆ పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలన్నది కార్యకర్తల మనోగతం. కానీ, సీనియర్ నేతగా దామోదర్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఆశీస్సులతో పటేల్ రమేశ్‌రెడ్డి ఎవరికి వారు టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. చివరకు బీ ఫాం ఎవరికి దక్కనుందనే ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ లో టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీపడుతుండగా, మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ పరిస్థితి పెద్దగా ఆశాజనకంగా లేదంటున్నారు. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు చరిష్మాపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే సూర్యాపేట పట్టణంలో తప్ప గ్రామీణ ప్రాంతంలో బీజేపీ ఉనికి కనిపించడం లేదని చెబుతున్నారు పరిశీలకులు.

మరోవైపు ఇటీవల మంత్రి జగదీశ్ రెడ్డితో విభేదించి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వట్టే జానయ్య బీఎస్పీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్దమై పోయారు. బిసీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ జగదీశ్ రెడ్డి అణిచివేస్తున్నారన్న ప్రచారం చేస్తున్నారు జానయ్య. నిన్నమొన్నటి వరకు మంత్రి జగదీశ్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న జానయ్య దందాల వెనుక జగదీష్ రెడ్డి హస్తం ఉందనే ప్రచారం స్థానికంగా జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోటీ కనిపిస్తున్నా బీజేపీ, బీఎస్పీ పార్టీలు చీల్చే ఓట్లే గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశాలున్నాయి. అటు కాంగ్రెస్‎లో టిక్కెట్ దక్కని నేత తీసుకోబోయే నిర్ణయం కూడా సూర్యాపేట ఫలితాన్ని తారుమారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

Updated On 14 Oct 2023 8:14 AM GMT
Ehatv

Ehatv

Next Story