లంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. మరో ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. అభ్యర్థుల ఎంపిక ఇప్పుడు గులాబీబాస్‌కు కత్తిమీద సాముగా మారే అవకాశం ఉంది. ఒక్కో నియోజకవర్గంలో నాలుగురైదుగురు ఆశావహులు ఉన్నారు. అసంతృప్తి భగ్గుమనకుండా సమస్యను ఎలా పరిష్కరించాలన్నదానిపై అధినాయకత్వం ఇప్పటి నుంచే కసరత్తలు మొదలు పెట్టింది. ఇదే సమయంలో త్వరలో ఖాళీ కానున్న రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఎవరితో భర్తీ చేయాలన్నదానిపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. మరో ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. అభ్యర్థుల ఎంపిక ఇప్పుడు గులాబీబాస్‌కు కత్తిమీద సాముగా మారే అవకాశం ఉంది. ఒక్కో నియోజకవర్గంలో నాలుగురైదుగురు ఆశావహులు ఉన్నారు. అసంతృప్తి భగ్గుమనకుండా సమస్యను ఎలా పరిష్కరించాలన్నదానిపై అధినాయకత్వం ఇప్పటి నుంచే కసరత్తలు మొదలు పెట్టింది. ఇదే సమయంలో త్వరలో ఖాళీ కానున్న రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఎవరితో భర్తీ చేయాలన్నదానిపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. శాసనమండలిలో మే 27న గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ (MLC) స్థానాలు ఖాళీ అవుతున్నాయి. డి.రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్ పదవీ కాలం వచ్చే నెలలో ముగియనుంది. వీరిద్దరూ మైనారిటీలే! పైగా మూడుసార్లు ఎమ్మెల్సీగా పని చేసినవారే! ఈసారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నది గులాబీ బాస్ భావన. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌ను తెలంగాణ మంత్రివర్గం సిఫార్సు చేసింది. కానీ ఆ ఫైల్‌ను గవర్నర్ తమిళసై మూడు నెలల పాటు పెండింగ్‌లో పెట్టడమే కాకుండా, కౌశిక్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆమోదించలేదు. ఫైల్‌ను వెనక్కి పంపించారు గవర్నర్. గవర్నర్ కోటాలో ఎన్నికయ్యే ఎమ్మెల్సీలకు కొన్ని అర్హతలు ఉండాలన్నది తమిళ సై (Governor Tamilisai) వాదన. ఈసారి మాత్రం అలాంటిది జరగకుండా కేసీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థి గుణగణాలు, ఏ రంగంలో ప్రసిద్ధులు, విద్యార్హతలు ఏమిటి? కేసులు గట్రాలు ఏమైనా ఉన్నాయా? అన్నది ఆరా తీస్తున్నారు.
రెండు స్థానాలను బీసీ సామాజికవర్గాల వారికి కేటాయించాలని బీఆర్‌ఎస్ భావన. సమీకరణాలు కుదరకపోతే కనీసం ఒక్కటైనా బీసీలకు(BC) ఇవ్వాలని కేసీఆర్ (CM KCR) అనుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు బీసీ పాటపాడుతోంది. పల్లెపల్లెకు ఓబీసీ, ఇంటింటికి బీజేపీ అన్న నినాదాన్ని ఎత్తుకుంది. ప్రధానమంత్రి మోదీ కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడేనని చెప్పుకొస్తోంది. కాంగ్రెస్ కూడా బీసీలను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. బీసీల గణనకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించిన రాహుల్‌గాంధీ బీసీల విషయంలో బీజేపీ వైఫల్యాలనూ ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. బీసీల పట్ల ఈ రెండు పార్టీలకు ఉన్నది కపట ప్రేమేనని, తాము మాత్రమే బీసీలకు న్యాయం చేయగలమని బీఆర్‌ఎస్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే బీసీ సామాజికవర్గాలకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించుకుంది.
పార్టీలో కష్టపడిన బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. వాక్పటిమ, వాక్చాతుర్యము, మేధోసంపత్తి ఉండి బాగా చదువుకున్న నేతగా పేరొందిన దాసోజు శ్రవణ్‌కుమార్ (Dasoju Sravan) పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రేసులో గౌడ సామాజికవర్గానికి చెందిన బూడిద బిక్షమయ్య (Bikshamaiah Goud) కూడా ఉన్నారు. గతంలోనే బిక్షమయ్యకు భువనగిరి లోక్‌సభ టికెట్ కానీ, ఎమ్మెల్సీ పదవి కాని ఇస్తానని కేసీఆర్ ప్రామిస్ చేశారు. భువనగిరి లోక్‌సభ స్థానంలో గౌడ సామాజికవర్గ ఓట్లు ఎక్కువ. 2014లో బూర నర్సయ్య గౌడ్ గెలవడంలో గౌడ సామాజిక ఓట్లు కీలక పాత్ర వహించాయి. ఇప్పుడాయన బీజేపీలోకి వెళ్లారు. ఇప్పుడు బిక్షమయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలా? లేక భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలా ? అన్న సందిగగ్దతావస్థలోనే కేసీఆర్ ఉన్నారు. మరో బీసీ నేత క్యామ మల్లేష్ పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తోంది.
విద్యార్థి నేత డి.రాజారాం యాదవ్‌ను సిఫార్సు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు పతాక స్థాయికి తీసుకెళ్లారన్నదాంట్లో ఎలాంటి సందేహమూ లేదు. ఉద్యమం ఉధృతరూపం దాల్చడానికి వీరే కారణం. అందుకే చాలా మంది విద్యార్థి నేతలకు కేసీఆర్ పదవులు ఇచ్చి గౌరవించారు. బాల్క సుమన్, గాదరి కిషోర్, పిడమర్తి రవిలకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించారు. రవి ఓడిపోయారు కానీ సుమన్, కిషోర్‌లు రెండుసార్లు గెలిచారు. ఇంకొందరు నేతలకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చారు కేసీఆర్. తెలంగాణ కోసం పోరుసల్పిన విద్యార్థులలో కొందరిని చట్టసభల్లోకి పంపించాలనుకుంటున్నారు గులాబీబాస్. ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు డి.రాజారాం యాదవ్. చిరుమల రాకేశ్, తుంగ బాలు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను నిలువరించి, దాడి చేసిన ఘటనతో డి.రాజారాం యాదవ్ పేరు మారుమోగింది. ఆయన మొండిధైర్యాన్ని చాలా మంది తెలంగాణవాదులు మెచ్చుకున్నారు కూడా! అలాగే తెలంగాణ కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. ఎమ్మెల్సీ కవిత ఆహ్వానం మేరకు బీఆర్‌ఎస్‌లో చేరారు. హుజూరాబాద్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో బాగా కష్టపడ్డారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రాజారాం యాదవ్ పేరును సిఫార్స్ చేయాలని భావిస్తోంది అధినాయకత్వం. చిరుమల రాకేశ్ కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడే! ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా దానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. కార్పొరేషన్ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. బీసీ సామాజికవర్గానికే అవకాశం ఇవ్వాలని అధినాయకత్వం భావిస్తే మాత్రం బూడిద బిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్‌కుమార్, రాజారాం యాదవ్‌లకు ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ ముగ్గురు ఆ పదవులకు సమర్థులే!