తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించారు. కాంగ్రెస్‌కు(Congress) పట్టం కట్టారు. ఈ పరిణామం సహజంగానే బీఆర్‌ఎస్‌కు మింగుడుపడటం లేదు. ఆరు నెలల్లో కేసీఆర్(KCR) ముఖ్యమంత్రి కావడం ఖాయమంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఇదేలా సాధ్యమో వారికే తెలియాలి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం గుంభనంగా చేయాల్సిందంతా చేసుకువస్తున్నది.
తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించారు. కాంగ్రెస్‌కు(Congress) పట్టం కట్టారు. ఈ పరిణామం సహజంగానే బీఆర్‌ఎస్‌కు మింగుడుపడటం లేదు. ఆరు నెలల్లో కేసీఆర్(KCR) ముఖ్యమంత్రి కావడం ఖాయమంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఇదేలా సాధ్యమో వారికే తెలియాలి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం గుంభనంగా చేయాల్సిందంతా చేసుకువస్తున్నది. ఇప్పటికే అయిదారుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని(CM revanth reddy) కలుసుకున్నారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామని చెబుతున్నారు కానీ, ఆ మాటలను జనం నమ్మడం లేదు. రేవంత్‌రెడ్డికి పాలన చేతకాదని, వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని దించేస్తామని బీఆర్‌ఎస్ అగ్రనేతలు రోజుకు ఒక్కసారైనా అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ అంటోంది. లేటెస్ట్‌గా రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలోనే కలిశారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి మరీ సత్కరించారు. అబ్బే అది కాంగ్రెస్ కండువా కాదని, మూడు రంగులున్నంత మాత్రాన కాంగ్రెస్ కండువా ఎలా అవుతుంది అని బీఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారనుకోండి.
చూస్తూ ఉంటే ఏదో జరుగుతోందని అనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బ్రహ్మండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో కలిపేసుకుంది. కాంగ్రెస్‌ను భలే దెబ్బతీశామని మురిసిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంతకంత బదులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఉంది. బీఆర్‌ఎస్ చేసిన పనికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే తీరుతామని కాంగ్రెస్ నాయకులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ముందస్తుగా కాంగ్రెస్ మున్సిపాలిటీల(Muncipalty elections) మీద దృష్టి పెట్టింది. బీఆర్‌ఎస్ గుప్పిట ఉన్న మున్సిపాలిటీలను హస్తం చేసుకునే పని మొదలు పెట్టింది. ఇప్పటికే చాలా మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి. బీఆర్‌ఎస్ ఏమీ చేయలేని నిస్సహాయస్థితికి వచ్చేసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ చెప్పినట్టు నిజంగానే భారీ వలసలు ఉండవచ్చనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలతో మాటాముచ్చట అయిపోయింది. మంచి ముహూర్తం కోసం చూస్తున్నారు కాబోలు. ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డిని కలిసినప్పుడు గులాబీదళంలో గుబులు మొదలయ్యింది. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశాము తప్ప ఇందులో రాజకీయమేమీ లేదని ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది. లేటెస్ట్‌గా సీఎంను కలిసిన ప్రకాశ్‌గౌడ్ కూడా ఇదే మాట అంటున్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఒకప్పుడు తెలుగుదేశంపార్టీకి చెందిన వారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరుఫునే విజయం సాధించారు. అంటే రేవంత్‌రెడ్డి పాత మిత్రుడే అన్నమాట! స్నేహితుడి కోసం పార్టీ మారినా మారవచ్చు! పార్టీలు మారడం అలవాటయ్యింది కదా!