రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ రాజ్యమా లేదా ఖాకీల రాజ్యమా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు

రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ రాజ్యమా లేదా ఖాకీల రాజ్యమా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తే సహించేదే లేదని, చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ పార్టీ పెట్టిన అక్రమ కేసులు ఎదుర్కొంటు అరెస్టయ్యి జగిత్యాల సబ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ నేత, హబ్సీపూర్ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి(Rajeshwar Reddy)ని గురువారం నాడు ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఎమ్మెల్సీ కవిత వెంట మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar), బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్(Sanjay), కల్వకుంట్ల సంజయ్ కుమార్(Kalvakuntla Sanjay Kumar) ఉన్నారు.

అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. అధికారం మారగానే సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని కక్షపూరితంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Jeevan Reddy) అక్రమంగా సంబంధం లేని కేసులో ఇరికించి అరెస్టు చేయించి జైలులో పెట్టించారని తెలిపారు. గతంలో ఎప్పుడు జరగనంత బీఆర్ఎస్ పార్టీ(BRS Party), కేసీఆర్(KCR) హయాంలో జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చెందిందని, దాన్ని ఓర్వలేక తమ పార్టీ సర్పంచ్ ను జైలులో వేయడం దారుణమని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కక్షపూరిత వైఖరితో తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించడాన్ని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చట్టపరంగానే కాకుండా వీధుల్లో, ప్రజాక్షేత్రంలో తాము ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నామని, ఏ పార్టీ కార్యకర్తలపై అయినా తాము రాజకీయంగా పోరాటం చేశాము తప్పా చట్టాన్ని, పోలీసులను వాడుకొని ఇలా కక్షపూరితంగా వ్యవహరించలేదని గుర్తు చేశారు. ఇది కాంగ్రెస్ రాజ్యమా... ఖాకీల రాజ్యమా అన్నట్లు రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఉన్నదని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ఇటువంటి వైఖరి ఎక్కువ రోజులు నిలబడదని, ప్రజలు తిరగబడుతారని స్పష్టం చేశారు. అమలు సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు కోసం పనిచేస్తూ హామీల అమలుకు ప్రయత్నం చేయాలని సూచించారు.

యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థినులను మహిళా పోలీసులు జుట్టుపట్టి లాగి పడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో గతంలో ఎప్పుడూ పోలీసులు ఈ రకంగా వ్యవహరించలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఒరవడి ప్రారంభమైందని, ఇలాంటి అధికారం పోలీసులకు ఇచ్చి ఇది కాంగ్రెస్ రాజ్యమా లేదా ఖాకీల రాజ్యమా అన్నట్లు చేస్తున్నారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. ఉద్యమాలు, పోరాటాలు చేసి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఇదే ఖాకీల మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము కాబట్టి అదే స్పూర్తితో ముందుకెళ్దామని అన్నారు. అంతిమంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Updated On 25 Jan 2024 8:35 AM GMT
Yagnik

Yagnik

Next Story