తెలంగాణలో(Telangana) అధికార, విపక్షాల మధ్య నీటి మంటలు ఉధృతమవుతున్నాయి.
తెలంగాణలో(Telangana) అధికార, విపక్షాల మధ్య నీటి మంటలు ఉధృతమవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై(Kaleshwaram Project) జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సమావేశం ముగిసిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Utham kumar reddy) చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish rao) తీవ్రంగా తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉత్తమ్ అవాకులు చెవాకులు పేలి, తన అవగాహనారాహిత్యాన్ని మరోసారి బయటపెట్టుకున్నారన్నారు. ఒకవైపు మేడిగడ్డ పునాదిని బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం అని అంటూనే మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు సాధ్యపడలేదు అని ఆయన అనడం తెలివితక్కువతనానికి నిదర్శనమని హరీశ్ చెప్పారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) 2023 అక్టోబర్ చివరలో హడావుడిగా వండి వార్చిన రాజకీయ నివేదికపై ఆనాడే విమర్శలు వెల్లువెత్తాయని,ఎలాంటి పరిశీలన జరపకుండానే, ఎటువంటి భూభౌతిక పరీక్షల ఫలితాలు లేకుండానే, తెలంగాణ ఇంజనీర్లతో ఏమీ చర్చకుండానే ఇటువంటి నిర్ధారణలకు రావడం కేంద్ర ప్రభుత్వ అధీనంలో పని చేసే ఒక సాంకేతిక సంస్థ చేయవలసిన పని కాదని హరీశ్ అన్నారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి(congress) లబ్ధి చేకూర్చడానికే ఈ నివేదికను ఇచ్చారని చెప్పారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నది గర్భంలో జరిగే మార్పుల కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని డ్యాం సేఫ్టీ అథారిటీ వారే ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హమని హరీశ్ తెలిపారు. గత ప్రభుత్వంపై, తెలంగాణ ఇంజనీర్లపై బురద జల్లే ప్రయత్నమే తప్ప బ్యారేజి పునరుద్దరణకు నిర్మాణాత్మక సూచనలు చేయడంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ దారుణంగా విఫలమైందని అన్నారు. 'తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతామని ఉత్తమ్ కుమార్ అన్నారు. సంతోషం. మా ప్రభుత్వం గతంలోనే 148 మీటర్ల ఎత్తు దగ్గర బ్యారేజి నిర్మించాడానికి మహారాష్ట్రను ఒప్పించాము. మహారాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసింది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజి ఏ ఎత్తు వరకు కడతారు? ఒప్పందం ప్రకారం 148 మీటర్ల వరకా ? 152 మీటర్ల వరకా ? అన్నది ఉత్తమ్ స్పష్టం చేయాలి. 152 మీటర్ల వద్ద బ్యారేజి కట్టాలని అనుకుంటే మొదట మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని, ఆ తర్వాతే బ్యారేజి పనులను ప్రారంభించాలని ఉత్తమ్‌ను కోరుతున్నా' అని హరీశ్ చెప్పుకొచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టును హడావుడిగా , అట్టహాసం ప్రారంభించామని ఆరోపించడం వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి తప్ప మరోటి కాదని తెలిపారు. లక్ష కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించారు అంటూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాతపాటే పాడుకొచ్చారని విమర్శించారు.
'కాళేశ్వరంలో అయిదేళ్ల పాటూ పంప్ అయిన నీళ్లు 65 టిఎంసీలు మాత్రమే అని ఉత్తమ్ చెప్పడం మరొక విచిత్రం' అని హరీశ్ చెబుతూ ఇప్పటి వరకు పంప్ అయిన నీటి వివరాలను అందించారు.