నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎంఎల్ఎ అభ్యర్ధిని మారుస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల అధిష్టానం చేపట్టిన సర్వే ఆధారంగా 20 మంది అభ్యర్ధులను మార్చే అవకాశం ఉందని, ఆ లిస్టులో ఈ నియోజకవర్గం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఆ పార్టీ నేతల్లో టిక్కెట్ కోసం పోటీ పెరిగింది.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎంఎల్ఎ అభ్యర్ధిని మారుస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల అధిష్టానం చేపట్టిన సర్వే ఆధారంగా 20 మంది అభ్యర్ధులను మార్చే అవకాశం ఉందని, ఆ లిస్టులో ఈ నియోజకవర్గం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఆ పార్టీ నేతల్లో టిక్కెట్ కోసం పోటీ పెరిగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు నేతలు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ సారి నాకే టిక్కెట్ దక్కుతుందని చెప్పుకుంటున్నారు ఆ నేతలు.
ఎంఎల్ఎల పని తీరుపై అధికార బిఆర్ఎస్ జనవరి నెల నుంచి ఇప్పటి వరకు 11 సార్లు సర్వే నిర్వహించిందట. ఆ సర్వే ఆధారంగా పని తీరు సరిగా లేని 20 మంది ఎంఎల్ఎలను ఈ సారి మార్చాలనుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఆ లిస్టులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కల్వకుర్తి నియోజకవర్గం కూడా ఉందట. ఈ సారి అభ్యర్ధిని మార్చడం ఖాయమనే ప్రచారం జోరందుకోవడంతో బిఆర్ఎస్ టిక్కెట్ కోసం ఇప్పటి నుంచే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇప్పటి నుంచి ప్రజల్లోకి విస్తృతంగా వెల్లడంతో పాటు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. అలా చేస్తున్న వారిలో ఐదుగురు నేతలున్నారు. బిఆర్ఎస్ టిక్కెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న వారిలో ఎంఎల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్, కల్వకుర్తి మున్సిపల్ ఛైర్మన్ ఎడ్మ సత్యం, గోలి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
ఆది నుంచి ఎంఎల్ఎ జైపాల్ యాదవ్, ఎంఎల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి అస్సలు పడడం లేదు. ఇరు వర్గాలు ఎదురు పడితే చాలు ఘర్షణకు దిగుతున్నారు. ప్రోటోకాల్ విషయంలోనూ బహిరంగంగానే విమర్శించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ప్రతి గ్రామంలో తమ వర్గాన్ని కొనసాగిస్తున్నారు ఎంఎల్సీ. రెండు సార్లు స్థానిక సంస్థల ఎంఎల్సీగా గెలుపొందిన కసిరెడ్డి ఈ సారి ఎంఎల్ఎ ఎన్నికల బరిలో దిగాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే రోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకుంటున్నారట. ఇతర పార్టీలో తన వర్గీయులుగా ఉన్న వారిని బిఆర్ఎస్ లో చేర్చుకోవడం, పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నారు. అంతేగాక వీలైనంత ఎక్కువ సమయాన్ని నియోజకవర్గంలో గడిపే ప్రయత్నం కూడా చేస్తున్నారట. అంతేగాక ఈ సారి బిఆర్ఎస్ టిక్కెట్ తనకే వస్తుందని కూడా చెప్పుకుంటున్నారట కసిరెడ్డి నారాయణ రెడ్డి. అంతేగాక తన అనుచరగణాన్ని ఎన్నికలకు సిద్దం చేస్తున్నారట.
కల్వకుర్తి బిఆర్ఎస్ టిక్కెట్ ఆశిస్తున్న వారిలో మరో నేత మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్. ఈయన గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును ఓడించి..మంత్రిగా పని చేశారు. బిసి సామాజిక వర్గాల్లో మంచి పట్టున్ననాయకుడు.. పాత తరం నేతగా పేరుంది. గత ఎన్నికల్లోనే టిక్కెట్ ఆశించి బిఆర్ఎస్ లో చేరారు. కానీ ఈసారి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట దాస్. ఇప్పటికే అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారట. ఎంఎల్ఎ వైఫల్యాలను ఎత్తి చూపుతూ మార్చి నెలలో కల్వకుర్తి లో తన ప్రధాన అనుచరులు, అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంపై స్థానిక ఎంఎల్ఎ జైపాల్ యాదవ్ బిఆర్ఎస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
కల్వకుర్తి బిఆర్ఎస్ టిక్కెట్ ఆశిస్తున్న వారిలో మరో వ్యక్తి నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్. చారగొండ జడ్పీటిగా ఉన్న బాలాజీ సింగ్..పూర్తి సమయాన్ని కల్వకుర్తికి కేటాయిస్తున్నారట. తన పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 12న కడ్తాల్ నుంచి కల్వకుర్తి వరకు భారీ ర్యాలీ నిర్వహించి, బలనిరూపన చేసే ప్రయత్నం చేశారు. మరో నేత కల్వకుర్తి మున్సిపల్ ఛైర్మన్ ఎడ్మ సత్యం కూడా ఈ సారి బిఆర్ఎస్ టిక్కెట్ ఆశిస్తున్నారట. మాజీ ఎంఎల్ఎ ఎడ్మ కృష్ణారెడ్డి తనయుడిగా 2002 నుంచి బిఆర్ఎస్ లో ఉన్న వ్యక్తిగా ఈ సారి అవకాశం తనకే వస్తుందని చెప్పుకుంటున్నారట. టిఆర్ఎస్ ఆవిర్భవించిన కొత్తలో మొదటి సారి కల్వకుర్తికి కెసిఆర్ ను తీసుకొచ్చి బహిరంగ సభను పెట్టింది ఎడ్మ సత్యమేనట. అందుకే అధిష్టానం తన వైపు మొగ్గు చూపుతుందని, ఈసారి బిఆర్ఎస్ అభ్యర్ధిని తానేనని ప్రకటించుకుంటున్నారట. అంతేగాక మున్సిపల్ ఛైర్మన్ గా పట్టణానికి పరిమితం కాకుండా నియోజకవర్గం మొత్తం తిరిగుతూ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. ఎడ్మ కృష్ణారెడ్డి మెమోరియల్ ట్రస్టు ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు, పేదలకు ఆర్థిక సహాయం చేస్తూ ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారట.
2015 నుంచి బిఆర్ఎస్ లో కొనసాగుతూ..నామినేటెడ్ పదవిని ఆశించిన గోలి శ్రీనివాస్ రెడ్డి కూడా బిఆర్ఎస్ టిక్కెట ఆశిస్తున్నారట. ఈ సారి బిఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే తనకు నామినేటెడ్ పదవి అధిష్టానం ఇవ్వలేదని చెప్పుకుంటున్నారట. జిఎస్ఆర్ యువసేన పేరుతో నియోజకవర్గంలో విస్తృతంగా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారట శ్రీనివాస్ రెడ్డి. అంతేగాక ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ, సొంత ఖర్చుతో నియోజకవర్గం వ్యాప్తంగా వాల్ రైటింగ్ కూడా చేయించారట. మే21వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా కడ్తాల్ నుంచి మైసిగండి,అమన్ గల్,వెల్దండ మీదుగా కల్వకుర్తి వరకు భారీ ర్యాలీ నిర్వహించి..బలనీరుపణ చేసుకున్నారట. అప్పుడప్పుడు మంత్రి కెటిఆర్ ను కూడా కనిపించి వస్తున్నారట. ఈ సారి బిఆర్ఎస్ టిక్కెట్ తనకే దక్కుతుందని చెప్పుకుంటున్నారట శ్రీనివాస్ రెడ్డి.
సిట్టింగులకే బిఆర్ఎస్ టిక్కెట్ అని అధిష్టానం స్పష్టంగా ప్రకటించినప్పటికీ...కల్వకుర్తి నియోజకవర్గంలో ఇంత మంది ఆశావాహులు పుట్టుకురావడం రానున్న రోజుల్లో గ్రూపు తగాదాలు..రెబెల్స్ బెడదకు సంకేతమని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎంఎల్ఎ అభ్యర్ధిని మార్చకపోతే పరిస్థితి ఏంటి...వీళ్లంత కలిసి పని చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Updated On 21 May 2023 5:05 AM GMT
Ehatv

Ehatv

Next Story