అరికేపూడి గాంధీ(Arikepudi gandhi) పీఏసీ చైర్మన్ పదవి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో నవ్వులాటగా మారింది.
అరికేపూడి గాంధీ(Arikepudi gandhi) పీఏసీ చైర్మన్ పదవి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో నవ్వులాటగా మారింది. పీఏసీ చైర్మన్ విషయంలో గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy), మంత్రి శ్రీధర్‌బాబు(Sreedhar) మాట్లాడిన మాటలు కామెడీని పండిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా అరికేపూడి గాంధీకి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. తాను కాంగ్రెస్‌లో చేరినట్లు గాంధీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేసుకున్నారు (ఇప్పుడు డిలీట్ చేసుకున్నారు). ఆ తర్వాత అరికేపూడి గాంధీ ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కండువాలతో సన్మానం చేశారు. కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా వేం నరేందర్‌రెడ్డిని కలుసుకున్నట్లు స్వయంగా గాంధీనే మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత గాంధీ కూడా పలువురు కార్యకర్తలకు కాంగ్రెస్ కండువాకప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అయితే అనూహ్యంగా అరికేపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టడంతో వివాదం చెలరేగింది. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పదవి గాంధీకి ఎలా ఇస్తారని నిలదీయడంతో.. అరికేపూడి గాంధీనే కామెడీ పండించే పాత్రను తొలుత తీసుకున్నారు. రేవంత్‌రెడ్డి కప్పిన కాంగ్రెస్ కండువా కాదట.. దేవుడి కండువా అట. అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశానని, నేను బీఆర్‌ఎస్‌లోనే(BRS) ఉన్నానని మీడియాతో చెప్పి హాస్యం జోడించారు. నిజానికి ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వాలనేది ఆనవాయితీ. అంతెందుకు కాంగ్రెస్ ఎంపీ కే.సి.వేణుగోపాల్‌కు బీజేపీ పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో పీఏసీ చైర్మన్ పదవికి హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్ వేసిన నామినేషన్లను పక్కన పెట్టి ఉన్నపళంగా గాంధీకి ఆ పదవి కట్టబెట్టారు. అసలు గాంధీ ఎప్పుడు నామినేషన్ వేసిండు, దాన్ని ఎప్పుడు పరిశీలించారు, ఆ పదవి ఎలా కట్టబెట్టారో ఎవరికీ తెలియదు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేస్తే కచ్చితంగా ఎన్నికలు పెట్టాలన్న నిబంధనను తుంగలో తొక్కారు. ఇదే విషయంపై ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేస్తూ మేం ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చినం అంటారు. అంటే ఏంటి అరికేపూడి గాంధీని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తూ కప్పిన కాంగ్రెస్ కండువా పెద్ద జోక్ అని ముఖ్యమంత్రే ఒప్పుకున్నారా? మళ్లీ ఎన్నికల ప్రక్రియ ద్వారానే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామని రేవంత్‌రెడ్డి చెప్నడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
గాంధీ కూడా నేను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే అంటాడు, అయితే తమ పార్టీ కండువా కప్పుకోవా అని కౌశిక్‌రెడ్డి అంటే ఏంజరిగిందో చూశాం. మరో మంత్రి శ్రీధర్‌బాబు తనకు చేతనైంత 'హాస్యం' పండించారు. ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడితే దాన్ని కాంగ్రెస్‌కు ఆపాదిస్తున్నారని సిల్లీగా మాట్లాడుతారు. దీనికి కౌంటర్‌గా కేటీఆర్(KTR) ట్వీట్ చేస్తూ.. 'యాక్టింగ్‌లో కింగ్ మీరు.. శ్రీధర్‌బాబుకు 'భాస్కర్' అవార్డు ఇవ్వాలన్నారు. అసలు అరికేపూడి గాంధీ కాంగ్రెస్‌లో ఉన్నారా లేదా బీఆర్‌ఎస్‌లో ఉన్నారా అంటే మరో మంత్రి పొన్నం ప్రభాకర్ పొంతన లేని సమాధానం చెప్తారు. ఓవైపు తమ పార్టీ కండువా కప్పుతారు, కాంగ్రెస్‌లో చేరారని ప్రకటించుకుంటారు. అధికారికంగా కాంగ్రెస్ హ్యాండిల్స్‌లో రాసుకుంటారు. మళ్లీ నాలుక మడతేస్తారు. ఇలా ముఖ్యమంత్రి మొదలుకొని, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పొంతనలేని మాటలు మాట్లాడుతూ హాస్యరంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.