బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ దేశ వ్యాప్తంగా సంచలమైన సంగతి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ దేశ వ్యాప్తంగా సంచలమైన సంగతి తెలిసిందే. అయితే ఆమె అరెస్టు గురించి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఎటువంటి వ్యాఖ్యలను ఇంతకు ముందు చేయలేదు. తాజాగా ఆయన స్పందిస్తూ.. కవిత అరెస్ట్ అక్రమమని అన్నారు. మద్యం పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని అన్నారు. బీజేపీ బీఎల్ సంతోష్ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయగా.. ఆయనపై కేసు నమోదు చేసి నోటీసులు పంపించామన్నారు. అందులో భాగంగానే కవితను మద్యం కేసులో కుట్రపూరితంగా ఇరికించారన్నారు కేసీఆర్. తాము బీఎల్ సంతోష్‌కు నోటీసులు జారీ చేశామని, పోలీసులు బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే దుర్మార్గుడైన ప్రధాని నరేంద్ర మోదీ బీఆర్ఎస్‌పై కక్ష కట్టారన్నారు. కవితపై ఎలాంటి కేసు లేదని కక్ష కట్టి అరెస్ట్ చేశారని అన్నారు.
104 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే బీజేపీ కూల్చే ప్రయత్నాలు చేసిందని, ఇక 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతకనిస్తుందా? అని కేసీఆర్ అన్నారు. గట్టిగా పోరాడితే లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్నారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సర్? అని ఓ సీనియర్ నేత తనను సంప్రదించాడన్నారు. కానీ ఇప్పుడే వద్దని తాను వారించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 8 లోక్ సభ సీట్లలో గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయని, మరో మూడు స్థానాల్లో విజయావకాశాలు ఉన్నాయన్నారు కేసీఆర్.