తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ కు 25 సంవత్సరాలు నిండాయి.

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ కు 25 సంవత్సరాలు నిండాయి. 2001లో ఏర్పడి 2014లో రాష్ట్రాన్ని సాధించే దాకా పుట్టినగడ్డ విముక్తి కోసం లెక్కలేనన్ని పోరాటాలు చేసిన బీఆర్ఎస్(BRS), అధికారంలోకి వచ్చిన తరువాత పదేండ్ల పాటు సుపరిపాలన అందించి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది. 17 నెలల క్రితం రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేవలం 2.05% ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, స్వల్ప కాలంలోనే ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్(Congress) ప్రభుత్వ వైఫల్యాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నది. తెలంగాణ(Telangana) ప్రయోజనాలే పరమావధిగా పదిహేడు నెలల నుంచి అద్భుతంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది.

లగచర్ల(Lagacharla)లో గిరిజన రైతులపై కాంగ్రెస్ చేసిన దాష్టికాలను యావత్ దేశం దృష్టికి తీసుకుపోవడంలో బీఆర్ఎస్ విజయవంతం అయింది. మూసీ, హైడ్రా బాధితులకు అండగా నిలబడింది. మొన్నటి హెచ్.సి.యూ(HCU) విద్యార్థుల పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచి 400 ఎకరాల పచ్చటి అటవీ భూమిని కాపాడుకుంది. అక్కడి వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా చేయాలనుకున్న రేవంత్ (Revanth reddy) ప్రభుత్వ దమనకాండను దేశం ముందుంచింది. త్యాగాల పునాదుల మీద అవతరించిన తెలంగాణను ఖతం పట్టించాలనుకుంటున్న కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కుంటూనే తన 25 ఏండ్ల రజతోత్సవ వేడుకలను(BRS 25th Anniversary Celebration) ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27న ఏర్పడిన తెలంగాణ ప్రజల ఇంటిపార్టీ బీఆర్ఎస్ 25 ఏండ్ల పండుగను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించబోతున్నారు. లక్షలాదిగా తరలివచ్చే జనానికి అందుకు తగ్గట్టుగానే తాత్కాలిక వసతి సౌకర్యాలు సిద్ధమయ్యాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి(Elkathurthy) రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ పార్టీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. మహాసభ ప్రాంగణాన్ని 154 ఎకరాల్లో సిద్ధం చేసింది. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్ ను ఏర్పాటుచేశారు. ఇక ఎల్కతుర్తికి వచ్చే అన్ని రోడ్డు మార్గాల్లో చెత్తను, ముండ్ల చెట్లను తొలగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ప్రతి రోడ్డుకు ఇరువైపులా మొరం పోసి చదును చేశారు. ఇక సభకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాల వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్‌ కోసం 1,059 ఎకరాలను కేటాయించారు. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు. సభకు వచ్చే ప్రజల కోసం లక్షకుపైగా కుర్చీలను ఏర్పాటు వేశారు. మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారికేడ్లు పెట్టారు. లైట్లు, ఎల్‌ఈడీల కోసం 200 భారీ జనరేటర్లను ఏర్పాటుచేశారు. కేసీఆర్‌ అందరికీ స్పష్టంగా కనిపించేలా 20/50 సైజుతో కూడిన 23 ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్‌ సిస్టంను చుట్టుపక్కల ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఏం మాట్లాడుతారోనని అటు పార్టీలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ehatv

ehatv

Next Story