ప్రధాని నరేంద్రమోదీ(PM Narendhra modi) రోడ్డు ర్యాలీలు, జై బజ్‌రంగ్‌బలి నినాదాలు బీజేపీని గెలుపు దిశగా తీసుకెళ్లలేకపోయాయి. చివరికి ది కేరళ స్టోరీ సినిమా కూడా గట్టెక్కించలేకపోయింది. ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వంలో చింతన మొదలయ్యింది. ప్రస్తుతం వారి ఏకైక ఆశ తెలంగాణ. తెలంగాణలో విజయం సాధించాలంటే ప్రక్షాళన అవసరమన్న భావనకు అధిష్టానం వచ్చింది.

కర్ణాటకలో(Karnataka) పరాజయం తర్వాత దక్షిణ భారతంలో బీజేపీకి(BJP) జాగా లేకుండా పోయింది. కర్ణాటక ముఖద్వారం నుంచి దక్షిణభారతదేశంలోని మిగతా రాష్ట్రాలలో నెమ్మదిగా విస్తరించాలనుకున్న బీజేపీ అధిష్టానానికి సహజంగానే ఈ ఓటమి ఆగ్రహం తెప్పించి ఉంటుంది. ప్రధాని నరేంద్రమోదీ(PM Narendhra modi) రోడ్డు ర్యాలీలు, జై బజ్‌రంగ్‌బలి నినాదాలు బీజేపీని గెలుపు దిశగా తీసుకెళ్లలేకపోయాయి. చివరికి ది కేరళ స్టోరీ సినిమా కూడా గట్టెక్కించలేకపోయింది. ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వంలో చింతన మొదలయ్యింది. ప్రస్తుతం వారి ఏకైక ఆశ తెలంగాణ. తెలంగాణలో విజయం సాధించాలంటే ప్రక్షాళన అవసరమన్న భావనకు అధిష్టానం వచ్చింది. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించాలని కమలదళం పెద్దలు అనుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. బీజేపీలో ఉన్న తొమ్మిది మంది అగ్రనేతలు సంజయ్‌(Sanjay) పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారట! బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించి మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఆ బాధ్యతను అప్పగించాలని అధిష్టానికి వీరు ఓ లేఖ కూడా రాశారు.

బండి సంజయ్‌ను తప్పించకపోతే మాత్రం తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని అగ్రనాయకత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారట! పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను కొనసాగిస్తే మాత్రం తాము పార్టీ నుంచి తప్పుకోక తప్పదని అసంతృప్త నేతలు అధిష్టానంతో చెప్పారట. ప్రస్తుతం పార్టీ చేరికల కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న ఈటల రాజేందర్‌కు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాల్సిందేనని, ఇవ్వకపోతే మాత్రం ఈటల కూడా పార్టీ నుంచి బయటకు వస్తారని సీనియర్లు అంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలవడానికి ఈటల రాజేందర్‌ ఢిల్లీకి వెళ్లారు. రాజేందర్‌ ఢిల్లీకి వెళ్లడం వెనుక బలమైన కారణం ఉండే ఉంటుందని సీనియర్లు అంటున్నారు. వీరంతా అగ్రనాయకత్వాన్ని కలవాలని అనుకుంటున్నారు. తమకు కనీసం ఓ పదిహేను నిమిషాల సమయం ఇస్తే చాలని, తెలంగాణ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో వివరిస్తామని అధిష్టానానికి కబురు పంపారట. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయినప్పటి నుంచే బండి సంజయ్‌పై అధిష్టానం గుర్రుగా ఉందట. అప్పటి నుంచి బీజేపీలో ఒక్కరంటే ఒక్క అగ్రనేత కూడా చేరలేదు. ఫలానా వాళ్లు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ సంజయ్ వర్గం చెబుతూ వస్తున్నదే కానీ కమలదళంలో చేరడానికి ఎవరూ ఉత్సాహం చూపించడం లేదు. ఇది బండి సంజయ్‌ చేతకాని తనమేనని అసంతృప్త నేతలు ఆరోపిస్తున్నారు.

తమ గోడును హైకమాండ్‌ పట్టించుకోకపోతే మాత్రం బీజేపీ నుంచి బయటకు వస్తామని సీనియర్‌ నేతలు అంటున్నారు. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి, కనీసం పాతిక అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తామని చెబుతున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు ఈటల రాజేందర్‌ కొత్త పార్టీకి అధ్యక్షులుగా ఉంటారని, ఈ కొత్త పార్టీ కాంగ్రెస్‌తో పత్తు పెట్టుకునే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ పదో తరగతి హిందీ పరీక్ష పేపర్‌ లీకేజ్‌ వ్యవహారంలో బండి సంజయ్‌ను ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. అప్పట్నుంచే అధిష్టానం దగ్గర సంజయ్‌ గ్రాఫ్‌ పడిపోతున్నదట! కర్ణాటక ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం చేశారు కానీ .. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థులెవరూ గెలవలేదు. కొందరైతే మూడో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఇది కూడా అధిష్టానం గుర్రుగా ఉండటానికి ఓ కారణం. పార్టీలో ప్రక్షాళన అనివార్యమనే ఆలోచనకు అగ్రనాయకత్వం వచ్చిందని సీనియర్లు అంటున్నారు. ఢిల్లీ నుంచి ఈటల రాజేందర్‌ ఏ కబురును తీసుకొస్తారోనన్న ఆతృతతో క్యాడర్‌ ఉంది.

Updated On 16 May 2023 1:36 AM GMT
Ehatv

Ehatv

Next Story