హైదరాబాద్ సెంటర్‎ అసెంబ్లీ సెగ్మెంట్ గోషామహల్. గోషామహల్ (Goshamahal)అంటనే గుర్తుకొచ్చే పేరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh). సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇక్కడి నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ బలంగానే ఉన్నా ఎన్నికల్లో పోటీపడలేకపోతున్నాయి. గోషామహల్ నుంచి హాట్రిక్ కొట్టేందుకు రాజాసింగ్ ఉవ్విళ్లూరుతుంటే..పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. రాజాసింగ్‎ అడ్డాలో జెండా పాతాలని గులాబీ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాజధాని రాజకీయాలకు కేంద్ర బిందువైన గోషామహల్‎ ఓటర్లు ఈసారి జైకొట్టేది ఎవరికి? రాజాసింగ్ హాట్రిక్ కొడతారా? రాజాసింగ్‎కు విపక్షాలు చెక్ పెడతాయా..? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

హైదరాబాద్ సెంటర్‎ అసెంబ్లీ సెగ్మెంట్ గోషామహల్. గోషామహల్ (Goshamahal)అంటనే గుర్తుకొచ్చే పేరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh). సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇక్కడి నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ బలంగానే ఉన్నా ఎన్నికల్లో పోటీపడలేకపోతున్నాయి. గోషామహల్ నుంచి హాట్రిక్ కొట్టేందుకు రాజాసింగ్ ఉవ్విళ్లూరుతుంటే..పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. రాజాసింగ్‎ అడ్డాలో జెండా పాతాలని గులాబీ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాజధాని రాజకీయాలకు కేంద్ర బిందువైన గోషామహల్‎ ఓటర్లు ఈసారి జైకొట్టేది ఎవరికి? రాజాసింగ్ హాట్రిక్ కొడతారా? రాజాసింగ్‎కు విపక్షాలు చెక్ పెడతాయా..? మీ నియోజకవర్గం..మా విశ్లేషణలో చూద్దాం.

హైదరాబాద్ మహానగరానికి గుండెకాయలాంటిది గోషామహల్. హోల్‎సేల్ వ్యాపారాలకు గోషామహల్ అడ్డా. గుండు పిన్ను నుంచి గుడుంబా సారా దాక..ఇక్కడ దొరకని వస్తువంటూ ఏదీ లేదు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు జీవనం సాగించే ఈ ప్రాంతం ఒక మినీ ఇండియా అని చెప్పొచ్చు. అలాంటి గోషా మహల్‌లో రాజకీయాలు సైతం అదే రేంజ్‌లో ఉంటాయి. గతంలో మహరాజ్‌‎గంజ్‌‎గా ఉన్న ఈ నియోజకవర్గం, 2009 పునర్విభజనలో భాగంగా గోషామహల్‌గా మారింది. ఇక్కడి రాజకీయ పరిస్థితులూ మారుతూ వచ్చాయి. ఒకప్పుడు రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీలదే హవా. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్‎గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే విభజన తర్వాత వరుసగా జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి విజయం సాధించిన రాజాసింగ్‌… ఇక్కడి పాలిటిక్స్‌కు కేరాఫ్‌గా మారిపోయారు. కార్పొరేటర్‌గా పొలిటికల్‌ కెరీర్‌ ప్రారంభించిన రాజాసింగ్‌.. అనతికాలంలోనే స్థానికంగా పట్టు సంపాదించారు. అందుకే, మంత్రి హోదాలో పనిచేసిన ముఖేశ్‌గౌడ్‌ను ఢీకొట్టి.. విజయం సాధించారు. అప్పట్లో పొలిటికల్‌గా సంచలనం రేపారు.

రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు, అన్ని మతాలు, వర్గాలకు చెందిన వాళ్లతో.. గోషామహల్ మినీ ఇండియాను తలపిస్తుంది. మొత్తం 2 లక్షల 82 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో సగానికిపైగా సెటిలర్సే ఉంటారు. ఇక్కడ గెలుపోటములను నిర్ణయించేది కూడా సెటిలర్సేనన్నది ఇక్కడి జరుగుతున్న ప్రచారం. ఇక ముస్లింలు 60 వేలు, క్రిస్టియన్లు 17 వేలు, ఎస్సీ, బీసీలు.. 73 వేల మంది దాకా ఉన్నారు. నార్త్ ఇండియా నుంచి వచ్చి, ఇక్కడ స్థిరపడిన లోధి వంశస్తుడు రాజాసింగ్. గోషామహల్ పరిధిలో లోధి వంశస్థుల ఓట్ బ్యాంక్ దాదాపు 30 వేలు ఉండటం.. రాజాసింగ్‌కు కలిసొస్తుంది. అయితే బీజేపీలో ఫైర్ బ్రాండ్‌ లీడర్‌గా పేరున్న రాజాసింగ్.. వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ నుంచి సస్పెండయ్యారు. ఆ తర్వాత జైలుకు కూడా వెళ్లొచ్చారు. కానీ టికెట్ల ప్రకటనకు గంట ముందు సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడమేకాకుండా రాజాసింగ్‎కు మరోసారి గోషామహల్ టికెట్‎ని ప్రకటించింది బీజేపీ అధిష్టానం.

ఈ నియోజకవర్గం పరిధిలో ఆరు గ్రేటర్ హైదరాబాద్ డివిజన్లు ఉన్నాయి. అవి.. బేగంబజార్, గన్ ఫౌండ్రి, జాంబాగ్, గోషామహల్, మంగళ్‌హాట్, దత్తాత్రేయనగర్. ఇక రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా ఉండే కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల ఆఫీసులు కూడా ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఇప్పటివరకు ఎంఐఎం నేరుగా ఇక్కడి నుంచి పోటీ చేయలేదు. గోషామహల్ అంటే.. రాజాసింగ్ అడ్డా అనే పేరుంది.
అదే.. ఆయన్ని వరుసగా రెండు సార్లు గెలిపించిందనే వాదనలున్నాయి. ఈసారి.. హ్యాట్రిక్ కోసం ఆయన ఆరాటపడుతున్నారు. అయితే ఈసారి రాజాసింగ్ ను ఎంపీగా పోటీ చేయిస్తారనే ప్రచారం జరిగింది. దీంతో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ ఇక్కడి నుంచి టికెట్ ఆశించి పార్టీలో చేరారు. గత నాలుగేళ్లుగా తనకే సీటు వస్తుందని నియోజకవర్గంలో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే చివరి నిమిషంలో మరోసారి రాజాసింగ్ కు టికెట్ కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. టికెట్ హామీ మీద పార్టీలో చేరిన విక్రమ్ గౌడ్ కు మరో చోట సర్దుబాటు చేస్తారా లేదా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గామారింది. అలాగే భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్‎రావు కూడా ఇక్కడి నుంచి టికెట్ ఆశించారు.

వచ్చే ఎన్నికలకు సంబంధించి గోషామహల్ పై అధికార పార్టీ గురి పెట్టింది. 2018 ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ సెగ్మెంట్లలో 12 స్థానాలను గెలుచుకుంది. గోషామహల్‎లో మాత్రం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఖాతా తెరవలేకపోయింది. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో పనిచేస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధిష్టానం గోషామహల్ సెగ్మెంట్‎ను పెండింగ్‎లో పెట్టింది. ఇక ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో నంద కిశోర్ వ్యాస్, ఆశిష్ కుమార్ యాదవ్ , ముఖేష్‎సింగ్, ఆనంద్ కుమార్ గౌడ్ ఉన్నారు. అయితే జీహెచ్ఎంసీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌‎గా ఉన్న శంకర్ యాదవ్ ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధిష్టానం శంకర్ యాదవ్‎కు గోషామహల్ టికెట్ కేటాయిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఖచ్చితంగా గోషామహల్‌లో గులాబీ జెండా ఎగరేస్తామన్న నమ్మకంతో ఉన్నాయి బీఆర్ఎస్ శ్రేణులు.

గోషామహల్ నియోజకవర్గంలో ఇంచుమించు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. గతంలో గోషామహల్ నుంచి నాలుగుసార్లు గెలిచిన కాంగ్రెస్ (Congress) పార్టీ..రాష్ట్ర అవతరణ తర్వాత ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతోంది. కాంగ్రెస్ తరఫున మెట్టు సాయికుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ (Mukesh Goud) ఫ్యామిలీ బీజేపీలో చేరడం మెట్టు సాయికి కలిసొస్తుందనే ప్రచారం నియోజకవర్గంలో చాలా బలంగా వినిపిస్తోంది. అంతేకాదు.. ఆయన ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడం.. ముదిరాజ్ ఓటు బ్యాంక్ 28 వేలుగా ఉండటం సాయి కుమార్‎కు అనుకూల అంశంగా చెబుతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్‌కు ఉండే సంప్రదాయ ఓట్ బ్యాంక్, గోషామహల్ పరిధిలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి కూడా కలిసి వస్తుందనే నమ్మకం కాంగ్రెస్ క్యాడర్‌లో కనిపిస్తోంది.

గోషామహల్ నియోజకవర్గంలో స్థానిక ప్రజలను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రధానంగా డ్రైనేజీ, రోడ్లు, ట్రాఫిక్ సమస్యలున్నాయి. దీనికితోడు అధికారులు వేసే ట్యాక్స్‌లతో.. వ్యాపార వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వీటన్నింటికి పరిష్కారం దొరకాలంటే.. నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలని గోషామహల్ ఓటర్లు కోరుకుంటున్నారు. కాబట్టి.. అందుబాటులో ఉండే నాయకుడి కోసమే ఇక్కడి ప్రజలు చూస్తున్నారు. అయితే హిందూ ఓటు బ్యాంకు బలంగా ఉండటం, బలమైన క్యాడర్ ఫాలోయింగ్, డివిజన్లలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావడం, ఇతర పార్టీలకు బలమైన అభ్యర్థులు లేకపోవడం బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ కు కలిసొచ్చే అనుకూల అంశాలు. అదే సమయంలో తరచు వివాదాల్లో చిక్కుకోవడం, నియోజకవర్గాన్ని అవృద్ధి చేయలేదనే ఆరోపణలు రావడం, పార్టీ నుంచి సస్సెండ్ కావడం రాజాసింగ్ కు ప్రతికూల అంశాలుగా మారాయి.

గోషామహల్ లో హ్యాట్రిక్ కోసం బీజేపీ(BJP) ఉవ్విళ్లూరుతుండగా.. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టేసింది. కొరకాని కొయ్యగా మారిన గోషామహల్‌లో ఎగిరే జెండా ఏంటి? రాజాసింగ్ ఇలాఖాలో తడాఖా చూపేదెవరన్నది ఆసక్తికరంగా మారింది.

Updated On 23 Oct 2023 5:32 AM GMT
Ehatv

Ehatv

Next Story