హైదరాబాద్ లోని పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ ఓ వీడియోను
హైదరాబాద్ లోని పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ ఓ వీడియోను వైరల్ చేశారు. అయితే ఆ వీడియోకు హైదరాబాద్ లో ఇటీవల జరిగిన పోలింగ్ కు ఎలాంటి సంబంధం లేదు. పాత వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో ప్రసారం చేసినందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్పొరేటర్ శ్రావణ్ వూరపల్లి, ఇతరులను హైదరాబాద్ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం గురువారం అరెస్టు చేసింది. బహదూర్‌పురాకు చెందిన క్లిప్ అంటూ.. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ లో అక్రమాలు జరిగాయని ప్రచారం చేశారు.
హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్ వూరపల్లి బీజేపీ మల్కాజిగిరి కార్పొరేటర్. పాత వీడియో క్లిప్ సర్క్యులేషన్‌పై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులు ఫిర్యాదు చేసిన తర్వాత మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం బీజేపీ కార్పొరేటర్‌ను ఆయన కార్యాలయం నుంచి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. వైరల్ క్లిప్ రాష్ట్రంలోని ఏ ఎన్నికలకు సంబంధించినది కాదని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం బుధవారం స్పష్టం చేసింది. తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగిందని తేల్చి చెప్పింది.