సీఎం కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డీఎస్సీ నోటిఫికేషన్‌పై బహిరంగ లేఖ రాశారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు? అని ప్రశ్నించిన ఆయన.. వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్(CM KCR)కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkatareddy) డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification)పై బహిరంగ లేఖ(Letter) రాశారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు? అని ప్రశ్నించిన ఆయన.. వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆధ్వర్యంలో ప్రగతి భవన్(Pragathi Bhavan) ముట్టడిస్తాం అని హెచ్చరించారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ(Telangana)లో ఏం జరుగుతోంది? నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగిన ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడ నెరవేరాయి? కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను అక్కడే వదిలేశారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మర్చారు. అనవసర ఆర్భాటాలకు పోయి ప్రజాధనం వృథా చేస్తున్నారు. ఇక కొలువుల సంగతి సరేసరి. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని..? భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని..? అదిగో ఇదిగో అంటూ నిరుద్యోగుల్ని ఊరించి వారిని నిండా ముంచేశారు. ముఖ్యంగా టీచర్ పోస్టుల అంశంలో పూర్తి నిర్లక్ష్యం వహించారు
ఉపాధ్యాయ పోస్టుల(Teacher Posts) కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు టెట్ రాసి సిద్ధంగా ఉన్నవారు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. తొలి టెట్ 2016 మే 22న జరిగింది. పేపర్-1కు 88,158 మంది హాజరు కాగా.. 48,278 మంది పాసయ్యారు. పేపర్-2ను 2,51,924 మంది రాయగా.. 63,079 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో టెట్ 2017 జులై 23న నిర్వహించారు. పేపర్-1ను 98,848 మంది రాయగా.. 56,708 మంది పాసయ్యారు. పేపర్-2కు 2,30,932 మంది హాజరుకాగా.. 45,045 మంది ఉత్తీర్ణులయ్యారు. మూడో టెట్ 2020 జూన్ 12న జరిగింది. పేపర్-1కు 3.18 లక్షల మంది హాజరు కాగా.. 1,04,578 మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్-2ను 2,50,897 మంది రాయగా 1,24,535 మంది పాసయ్యారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 12,500 మంది డీఎడ్, మరో 15,000 మంది బీఎడ్ కోర్సు పూర్తి చేస్తున్నారు.
రాష్ట్రంలో వేలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓవైపు రిటైర్డ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. వారి స్థానాల్లో కొత్తవారిని తీసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల కోసం సంవత్సరాలుగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. వీరిలో కొందరి వయో పరిమితి కూడా దాటిపోతోంది. దశాబ్ది ఉత్సవాలు అంటూ రోజుకో కార్యక్రమం పేరుతో ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం.. నిరుద్యోగుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదు. అమరవీరుల త్యాగ ఫలితం ఇదేనా? సకల జనులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇందుకేనా? అని ప్రశ్నించారు.
2020 డిసెంబర్ లో అసెంబ్లీ సాక్షిగా టీచర్ పోస్టుల భర్తీపై ప్రకటన చేశారు. అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగనే లేదు. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ పాలనలో 6 నెలలకు ఒకసారి టెట్, రెండేళ్లకు ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేవారు. మీ హయాంలో మాత్రం నిరుద్యోగం పెరిగిపోతోంది. అభ్యర్థులు నోటిఫికేషన్ల కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది. ఆఖరికి డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ధర్నాలతో రోడ్డెక్కే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి నిరుద్యోగుల బాధలను గుర్తించండి. ఎంతో వ్యయప్రయాసలు కోర్చి కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అవుతున్న వారి ఆశలపై నీళ్లు చల్లకండి. వారం రోజుల్లో నోటిఫికేషన్ రాకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లక్షలమంది నిరుద్యోగులతో ప్రగతి భవన్ ముట్టడిస్తాం అని లేఖలో హెచ్చరించారు.