✕
బతుకమ్మ(Bathukamma) కల్లలెరుగని తెలంగాణ(Telangana) ప్రజల సంబరం. పల్లె పల్లెన కనిపించే మహోత్సవం. వెల్లివిరిసే పూల సమ్మేళనం.వెదజల్లే మట్టి పరిమళం.
బతుకమ్మ.ఒక అందమైన సంస్కృతిని ప్రతిబింబించే అపురూప దృశ్యం. యాంత్రిక జీవనంలో విసిగిపోయే మహిళలకు ఉల్లాసాన్ని మానసిక నవోత్తేజాన్ని అందించే పర్వదినం. తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేకతలున్న నేల. ఇక్కడి భాష, యాస, ఆచారాలు, వ్యవహారాలు అన్నింటిలో జానపద ముద్ర కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పండుగలూ కూడా ప్రకృతి, వ్యవసాయం చుట్టూ అల్లుకుని వుంటాయి. బతుకమ్మ పండుగ అలాంటిదే! బతుకమ్మ అచ్చంగా స్త్రీల పండుగ. భాద్రపద అమావాస్యకు(Bhadrapada Amavasya) చాలా ప్రాముఖ్యత వుంది.

x
Bathukamma Celebrations
-
- పండుగ అలాంటిదే! బతుకమ్మ అచ్చంగా స్త్రీల పండుగ. భాద్రపద అమావాస్యకు(Bhadrapada Amavasya) చాలా ప్రాముఖ్యత వుంది. పెద్దల అమావాస్య అని, పితృ అమావాస్య, పెత్తరమాస, మహాలయ అమావాస్య అని పిలుస్తుంటారు. కాలంతో పరుగెత్తడం అలవాటయ్యాక తిథులను గుర్తు పెట్టుకోవడం ఒకింత కష్టమే! అందుకే అందరూ ఈ రోజు తమ పెద్దలకు, పితృదేవులకు పండుగ చేస్తారు. పెద్దలకు బియ్యం ఇవ్వడానికి పెత్రమాసం మంచిరోజు. ఈరోజు పైలోకాల్లో ఉన్న పితృదేవతలు భూలోకంలో తమ వారి కోసం వస్తారని భావిస్తారు. వారికోసం వారి సంతృప్తి కోసం సహపంక్తి భోజనాలు నిర్వహించి కులమతభేదం లేకుండా కలిసి భుజించాలని అంటారు. అలా చేయడం అందరికీ వీలవదని పితృదేవతల పేరుమీద బ్రాహ్మణులకు బియ్యం ఇచ్చే సంప్రదాయం ప్రారంభమైనట్లు పురోహితులు చెబుతున్నారు.
-
- మళ్లీ బతుకమ్మ దగ్గరకు వద్దాం! పల్లె సంబరం బొడ్డెమ్మ పండుగతో మొదలవుతుంది. నిజానికి ఈ ప్రాంత వాసులకు ఇది ఒక పండుగ కాదు. నాలుగు పండుగల మేళవింపు. బొడ్డెమ్మ పండుగ, పెద్దల పండుగ, బతుకమ్మ పండుగ, దసరా(Dasara) పండుగ. ఈ నాలుగింటిని వరుసగా జరుపుతారు. ఇది ఒకరోజు సంబరం కాదు. ఇరవై రోజుల ఉత్సవం. మెట్టినింటికెళ్లిన ఆడబిడ్డలందర్ని ఆప్యాయంగా పుట్టింటికి తీసుకొస్తారు. ఏడాది పొడవునా వ్యవసాయ పనులతో, ఇంటి పనులతో, అత్తింటి ఆరళ్లతో అలసిపోయిన ఆడవాళ్లకు తల్లిగారింటి నుంచి వచ్చే పిలుపు గొప్ప ఊరటనిస్తుంది. పుట్టినిల్లు కావాల్సినంత విరామాన్నిస్తుంది. చుట్ట పక్కాలు, చిన్ననాటి స్నేహితులు, పలకరింపులు, ఆప్యాయతలు, అభిమానాలు కష్టాలను కడతేరుస్తాయి. కొత్త ఉత్సాహాన్ని తెస్తాయి. మొత్తానికి తొమ్మది రోజులూ సందడే. అందుకే పేద కుటుంబాలైనా సరే, ఆడబిడ్డలను ఇంటికి పిలిపించుకుంటారు. ఇది కేవలం పండుగ కాదు.తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో ఆడబిడ్డల ప్రేమ బంధాలను గట్టిపరిచే సందర్భం.
-
- భాద్రపద పంచమి రోజున మగవాళ్లు వెళ్లి పుట్టమన్ను తెస్తారు. ఇక్కడి ప్రజల సంస్కృతిలో పుట్టమన్నుకు ప్రత్యేక స్థానం వుంది. ఇంట్లో కొత్త పొయ్యి వెయ్యటానికి కూడా పుట్టమన్నే వాడుతారు. దుర్గమ్మ పండుగకు పుట్టమన్ను తెస్తారు. పుట్టమన్ను తడిపి ఒక చిన్న పీట మీద చతురస్రాకారంలో గుడి గోపురం మీద అంతురాలు చేస్తారు. వాటికి వరుసగా రంధ్రాలుంటాయి. పీటకు నాలుగు దిక్కులా నాలుగు చదరపు ముద్దలుంటాయి. వాటికి ఒక్కొక్క రంధ్రముంటుంది. దీన్ని బొడ్డెమ్మ అంటారు. బొడ్డె అంటే చిన్న కుప్ప లేదా రాశి. నిజానికి ఇది మట్టి పూజ. ఉత్పత్తి అంటే పంట.. పునరుత్పత్తి అంటే సంతానం సవ్యంగా సాగాలని చేసే పూజ. సాయంత్రం బొడ్డెమ్మను అలుకుతో కాని జాజుతో కాని తీర్చి దిద్దుతారు.
-
- మట్టి రంధ్రాలలో రంగు రంగుల రుద్రాక్ష, గోరింట, ముద్దాన్న పూలు పెట్టి అలంకరిస్తారు. సంధ్యవేల కూడలిలోనో, పెద్ద వాకిట్లోనో నడుమ పేడతో అలికి ముగ్గు వేస్తారు. మధ్యలో బొడ్డెమ్మలన్నీ పెట్టి చుట్టూ తిరుగుతూ ఆడపిల్లలు ఆడతారుచీకటి పడిందాక ఆడి బొడ్డెమ్మలు తీస్తారు. నిదురపో బొడ్డెమ్మ నిదురపోవమ్మా.. నిద్రకు నూరేళ్లు, నీకు వెయేళ్లు అని పాటలతో నిద్ర పుచ్చి ఎవరింటికి వాళ్లు తీసుకెళతారు. ప్రతి సాయంత్రం ఇలా కొత్త అలుకు రాసి కొత్త పూలు అలంకరించి తొమ్మిది రోజుల తర్వాత పండుగ చేస్తారు. చివరి రోజు ఆట తర్వాత బొడ్డెమ్మలను బావిలో వేస్తారు.పెత్తరమాస రోజు నుంచి బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. మొదటి రోజును ఎంగిలిపూలంటారు. ఇంటి చుట్టూ దొరికే పూలన్నీ సంబరంలో పాలు పంచుకుంటాయి. రంగు రంగుల పూలన్నింటినీ తీసుకొచ్చి హారతి పళ్లెంలో అందంగా పేరుస్తారు.
-
- తెలంగాణలో ఈ పళ్లాన్ని తబుకు అంటారు. బతుకమ్మను పేర్చేటప్పుడు ఆ పూల కాడలను చేతులతో తుంచి పెడతారు. కత్తితో కట్ చేసినా, నోటితో కొరికినా ఆ పూలు ఎంగిలి అయినట్లు భావిస్తారు. అప్పట్లో కొందరు మహిళలు నోటితో కొరికి బతుకమ్మ పేర్చడం వల్ల అప్పటి నుంచి అమావాస్య రోజు ఆడే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారని చెబుతారు. మొదటి రోజు బతుకమ్మ పేర్చడానికి ముందు రోజు రాత్రే పువ్వులు తీసుకొస్తారని, ఆ పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరువచ్చినట్లు ఇంకొందరు చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో తిన్న తరువాత బతుకమ్మ పేరుస్తారని అందుకే ఆ పేరు వచ్చిందంటారు. మొదటి రోజు నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మగా పిల్చుకుంటారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ. అయిదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయ బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్ద బతుకమ్మ... తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. పెద్ద బతుకమ్మ కోసం ఒక రోజు ముందుగానే గడ్డి పువ్వు, గునుగుపువ్వు తెచ్చి తగినట్టుగా కోసి కట్టలు కట్టి పెట్టుకుంటారు.
-
- కొంతమందైతే.. అర్ధరాత్రి వెళ్లి తంగెడు చెట్టు దగ్గరే పడుకుంటారు. రాత్రి నుంచే పువ్వుల కోసం పోటీ పడతారు. గంపల్లో బస్తాల్లో పూలు నింపుకొస్తారు. కాస్త పొద్దు పొడిచాక.. బతుకమ్మను తీర్చిదిద్దడం మొదలవుతుంది. ఇంట్లో వున్న వాళ్లంతా తలో చేయి వేస్తారు. ఆడామగా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పువ్వలేరుతారు. పెద్ద పెద్ద బతుకమ్మలను సాధారణంగా మగవాళ్లే పేరుస్తారు. నిజానికి బతుకమ్మను పేర్చడం ఓ కళ. అలంకారినికో పరీక్ష. సౌందర్యాభిలాషకో నిదర్శనం. బతుకమ్మను పేర్చేవారికి పూల పరిచయముండాలి. . రంగుల రహస్యం తెలుసుండాలి. అద్దకం, కలంకారి పనితనం కావాలి. ముక్కాలి పీట, దాని మీద పెద్ద తాంబాలం. దాని మీద గుమ్మడి ఆకులు పరచి తంగెడు పూలు పేరుస్తారు. తంగెడు పువ్వుతోనే బతుకమ్మ ఎత్తు పెంచుతారు. నడుమ ఉనుకనో, తంగెడు తుక్కునో నింపుతారు. రంగుల్లో అద్దిన గునుగుపూల కట్టలను వలయాకారంలో పేరుస్తూ వస్తారు. బతుకమ్మకు ఒకటా రెండా … అన్ని పువ్వులూ అలంకరణలవుతాయి. రోకలి బండ పువ్వు, అడవి శాకుంతి, కట్లె పువ్వు, గోరింట, గన్నేరు పూలు ఒద్దికగా ఒదిగిపోతాయి. బతుకమ్మను పేర్చడమయ్యాక పసుపు గౌరమ్మను తీర్చుతారు . ఇంట్లో అలికి ముగ్గు పెడతారు. దాని మీద పీట పెట్టి అందులో బతుకమ్మను పెడతారు.
-
- ఆడవాళ్లు వరి, సజ్జ రొట్టెలను ముక్కలు చేసి చక్కెర పాకంలో వేసి ముద్దలు చేస్తారు. వీటినే మలీద ముద్దలని, కులీదలని అంటారు. రకరకాల సద్దులు చేస్తారు. పులుసు కలిపిన సద్ది, పెరుగు కలిపిన సద్ది చేస్తారు. కాస్త కలిగిన వాళ్లు పెసర, కొబ్బరి, నువ్వుల, పల్లీల బియ్యం పొడులు లకిపి తయారు చేసిన తొమ్మది రకాల సద్దులు బతుకమ్మ ముందు పెడతారు. అగరు వత్తులు ముట్టించి బతుకమ్మ పూల మధ్యలో చెక్కుతారు. పూజ చేస్తారు. కొత్త చీరలు కట్టుకొని తయారైన స్ర్తీలు బతుకమ్మను ఇంటి ముందు పెట్టి ఆడతారు. వంటలు సమర్పిస్తారు. మొక్కుతారు. సాయంత్రం నుంచి చీకట్లు ముసురుకొనే వరకు అడవాళ్లంతా తనివి తీరా ఆడతారు. ఆ తర్వాత తమ్మలి వాద్య సహకారంతో బతుకమ్మలు తలల మీద ఊరేగుతాయి.అంతకు ముందే బతుకమ్మలను వదలడానికి యువకులు పెద్దలు చెరువు కట్ట పొడుగునా బారులు తీరి వుంటారు. సందె చీకట్ల మధ్య చెరువులోని నీటి అలల మీద బతులకమ్మలు తేలియాడుతూ ముందుకు వెనక్కి కదులుతుంటూ అదో ఉద్వేగం. పోయిరా బతుకమ్మ పోయికరావమ్మ మల్లొచ్చే యాడాది తిరిగి రావమ్మా అంటూ ...శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ అంటూ పాటలు పాడుతారు. తెచ్చిన ప్రసాదాలు, ఫలహారాలు తబుకుల్లో పోసి ఒక్క దగ్గర అందరూ కూడతారు. గుంపులు గుంపులుగా కలిపి మరింత సందడిగా తుళ్లుతూ పరాచికాలాడుతూ పరవశించిపోతారు. ఈ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత ఒకరినొకరు ఇష్టపూర్వకంగా పలకరించుకుంటారు. ఆడపిల్లలాడుకునే అందమైన, అద్భుతమైన పూల జాతర మరెక్కడా కనిపించదు.

Ehatv
Next Story