రేవంత్‌రెడ్డి-అల్లు అర్జున్ వివాదంపై ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె.శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన అధికారిక హ్యాండిల్‌లో ఈ విధంగా రాశారు.

రేవంత్‌రెడ్డి-అల్లు అర్జున్ వివాదంపై ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె.శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన అధికారిక హ్యాండిల్‌లో ఈ విధంగా రాశారు. 'ప్రజాప్రయోజనాల ఇమిడి ఉన్న ఒక అంశానికి సంచలనత జోడించి, దాన్నొక వీధి తగవుగా మార్చి, నిర్వీర్యం చేయడం పాలకులు అనుసరించే ఒక ఎత్తుగడ. సమాజం తరఫు నుంచి వ్యవహరించ వలసిన ప్రభుత్వం, తన ఆచరణను కక్షసాధింపుగా, వ్యక్తిగత పంతంగా కనిపించేట్టు చేయడమంటే, ఇక అందులోనుంచి ప్రజా ప్రయోజన అంశాలు మాయమైనట్టే. అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు బాధితులకు న్యాయం జరగడం, భవిష్యత్తులో నివారించడం వంటి లక్ష్యాలనుకాక, మరి వేటికో గురిపెట్టినట్టు కనిపిస్తోంది.

మార్కెట్‌తో ముడిపడిన వినోద పరిశ్రమ, జనం సాంస్కృతిక ఆవేశాల మీద, సహజాత అభిరుచుల మీద ఆధారపడి వినియోగదారులను సృష్టించుకుంటుంది. ఆ క్రమంలోనే తారలూ అభిమానులూ పుడతారు. ప్రజాప్రతినిధులకు ఓటర్లకు మధ్య ఎంతో కొంత బాధ్యత, ఒప్పందం ఉంటాయి. కానీ సెలబ్రిటీలకు ఫాన్స్‌కు మధ్య మాత్రం అంతా ఏకపక్షమే. ఫాన్స్ అవ్యాజ, బేషరతు అభిమానం సమర్పించుకోవలిసిందే. అందుకు ప్రతిగా తారలు ఏమీ చేయనక్కరలేదు, అవే విలువలను, వీలైతే మరిన్ని హీన విలువలను కొత్తకొత్తగా రీఛార్జ్, రిఇన్ఫోర్స్ చేస్తూ ఉండడం తప్ప.

ఫాన్స్ మధ్యలో హీరో, తెర జీవితానికి వాస్తవానికి తేడా లేకుండా సంచరిస్తాడు. దేవుడి పాత్రలు వేసి దేవుణ్ణని, మాఫియా పాత్రవేసి అరివీర భయంకరుణ్ణని భ్రమలో పడతాడు. అందుకే వారికి, హాళ్ళలోనే కాదు రోడ్ల మీద కూడా జనం ఎగబడాలి, కిక్కిరిసిపోవాలి, చావులను కోరుకోరు కానీ తొక్కిసలాట జరిగి చొక్కాలు చినిగిపోవాలి. ఈ సన్నివేశాల మీదనే హీరోల మార్కెట్, సినిమాల ఓపెనింగ్స్ ఆధారపడతాయి.

ఒక మహిళ మరణానికి, ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితికి కారణమైన సంధ్య టాకీస్ తొక్కిసలాట మీద ప్రజలు ఎంతో కలవరంతో ఉద్వేగంతో స్పందించారు, ఇంకా ఆ చర్చ సాగుతూనే ఉంది. అల్లు అర్జున్ అభిమానులు ఒక నైతికమైన సంశయంలో పడిపోయి తమ హీరోను సమర్ధించుకోలేక సతమతమయ్యారు. జరిగిన దుర్ఘటనలో అర్జున్‌కు ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యత ఉంది. అట్లాగని అతను ఒక్కడే బాధ్యుడు అనడం కూడా సరికాదు. ప్రభుత్వం కూడా ఆయనను 11వ ముద్దాయిగా మాత్రమే చూపింది.

ఈ అంశం మీద సమాజం స్పందన, మానవీయ కోణం నుంచి మొదలై, వివిధ వ్యవస్థల బాధ్యతను చర్చించడం దాకా సాగింది. అర్జున్ భౌతిక ప్రమేయం గురించి కంటే, అతని నైతిక బాధ్యత మీద , అతని కంటి తుడుపు స్పందన మీద జనం పట్టింపు చూపారు. అర్జున్ కానీ, ఆయన సినిమా టీమ్ కానీ, ఆ మాటకు వస్తే, మొత్తం టాలీవుడ్ కానీ ఈ విషాదంలో ఇమిడి ఉన్న వ్యవస్థాగత అమానవీయత కు బాధ్యత తీసుకోవాలి. భారీ బడ్జెట్లు, హీరోల పారితోషికాలు, బెనిఫిట్స్ షోలు, అధిక ధరల టికెట్లు, థియేటర్ల గుత్తాధిపత్యం, అభిమానులను వేడెక్కించిన ప్రీ, పోస్ట్ ఈవెంట్లు…వీటన్నిటి మీద ఆత్మవిమర్శ చేసుకుని సంస్కరించుకోవాలి. మున్ముందు ఏ తొక్కిసలాటలూ దుర్మరణాలూ జరగవని సమాజానికి హామీ ఇవ్వాలి. బెనిఫిట్ షోలకు భారీ టికెట్లకు అనుమతించిన ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఈ బాధ్యతల గుర్తింపు, భవిష్యత్తులో వినోద ప్రేక్షకుల భద్రతకు, హక్కులకు గ్యారంటీ అవుతుంది.

ప్రభుత్వ చర్యల విశ్వసనీయత కూడా ఇక్కడ చర్చనీయం. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వానికి అల్లు అర్జున్ కు ఎన్నికల తగాదాలున్నాయని, ఆ నేపథ్యంలోనే రేవంత్ ప్రభుత్వం కఠినంగా ఉంటోందని కొందరు, సినీపరిశ్రమను తన దారికి తెచ్చుకోవడానికి వరుసచర్యలు తీసుకుంటోందని సామాజిక మాధ్యమాల్లో గగ్గోలుగా ఉంది. రేపో మాపో ఒప్పందం కుదిరి సుఖాంతం అవుతుంది చూడండన్న జోస్యాలు కూడా వినిపిస్తున్నాయి. ఇటువంటి నిరాధార కథనాలకు, ప్రభుత్వ చర్యలు సమర్థనలుగా కనిపించకూడదు కదా! న్యాయాన్ని అమలుచేయడం కక్షగానో పంతంగానో అనిపించగూడదు కదా? బీ ఆర్ ఎస్ తెలివి తక్కువ వైఖరి తీసుకుందని, దానితో ముఖాముఖి కోసం వీరంగం వేయడం ఏమి తెలివి? అల్లు అర్జున్ కు లాగే, రాష్ట్ర ముఖ్యమంత్రి కి కూడా నాసిరకం సలహాదారులు ఉన్నట్టున్నారు!

తప్పొప్పులను మీడియా ద్వారా తేల్చే తీర్పరి తనం కానీ, ఉన్నట్టుండి మంత్రులు సినిమా విమర్శకులై పోయి నేరగాళ్ల సినిమాలని నిందించడం కానీ ఏ ప్రయోజనమూ నెరవేర్చదు. అధికారపార్టీ అంతా కలిసి లించింగ్ చేస్తున్నట్టు ఎగబడితే, సానుభూతి అర్జున్ మీద పెరుగుతుంది తప్ప ఉపయోగం లేదు.

హైకోర్టు బెయిల్ ఇచ్చిన తీరు మీద చాలా మందికి భిన్నాభిప్రాయాలున్నాయి. న్యాయపాలన కానీ, నేర విచారణ కానీ మనదేశంలో జరిగే తీరు కొత్తదేమీ కాదు. నేరుగా తుపాకీ కాల్చిన సినిమా హీరో కు అన్ని వ్యవస్థలు కాపుగాసాయి. కోర్టు తగినవిధంగా స్పందించలేదని, మరోపద్ధతిలో శిక్షించాలనుకోవడం యూపీ మార్గం. బుల్డోజర్ లాగే దీన్ని కూడా దిగుమతి చేసుకోవాలనుకోవడం మంచి పద్ధతి కాదు. అల్లు అర్జున్ అయినా, మరే నిందితులైనా, తమ బాధ్యతను తప్పించుకోగూడదు. అలాగే ఆ మేరకు మాత్రమే పర్యవసానం అనుభవించాలి.అంతకు మించిన వేధింపు తగదు! మొత్తం వ్యవహారంలో ముందుకు వచ్చిన ప్రజా పట్టింపు అంశాలు విస్మరణలో పడకూడదు' అంటూ కె.శ్రీనివాస్‌ తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా వెల్లడించారు.

ehatv

ehatv

Next Story