ఐకాన్ స్టార్, పుష్పఫేమ్ అల్లు అర్జున్‌ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినా..
ఐకాన్ స్టార్, పుష్పఫేమ్ అల్లు అర్జున్‌ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినా.. అల్లు అర్జున్ తరపు లాయర్లు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ పేపర్లలో స్పష్టత లేవని రాత్రంతా జైలులోనే అల్లు అర్జున్‌ను ఉంచారు. శనివారం ఉదయం 6:45కు చంచల్‌గూడ జైలు బ్యాక్ గేటు నుంచి అతడిని పంపించారు. అయితే అరెస్టయి జైలుకు వెళ్లడంతో అల్లు అర్జున్ రాత్రి భోజనం చేయలేదు, నేలపైనే పడుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న తర్వాత ఆయనకు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతున్నారు. గంగోత్రి, బద్రినాథ్ సినిమాలకు రచయితగా వ్యవహరించిన చిన్ని కృష్ణ కాస్త ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్ అంటే తనకు ప్రాణం అని.. అలాంటి అర్జున్‌ను అరెస్ట చేయడంతో నిన్నంతా భోజనం చేయలేదన్నారు. ఆయనకు మరకలు అంటించాలనుకున్న ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని సర్వ నాశనం అయిపోతారని.. తర్వాత పరిణామాలు మీరే చూస్తారన్నారు. టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఈ ఒక్కసినిమాకే ఇవ్వలేదని చాలా సినిమాలకు ఇచ్చారని చిన్నికృష్ణ అన్నారు. మెగా ఫ్యామిలీతో చిన్ని కృష్ణకు మంచి అనుబంధం ఉంది. ఈ సందర్భంగానే బన్నీ అరెస్ట్‌పై ఘాటుగా స్పందించారంటున్నారు. మరోవైపు బన్నీ అరెస్ట్‌పై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. రష్మిక, హీరో నాని, నితిన్, బాలీవుడ్ హీరోలు వరుణ్ ధావన్, వివేక్ ఒబెరాయ్ అరెస్టును తప్పుబడుతున్నారు.
మరోవైపు అల్లు అర్జున్ అరెస్టుపై ఢిల్లీలో ఓ చానెల్‌తో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఆయన ఏమన్నా ఇండో-పాక్ బార్డర్‌లో యుద్ధం చేశాడా.. సినిమా చేశాడు, డబ్బులు తీసుకున్నాడు.. ఒకరి మరణానికి కారణమైనందుకే అరెస్ట్ చేశామన్నారు. చట్టం అందరికీ సమానమేనని.. అల్లు అర్జున్ సినిమా చూడడమే కాకుండా బహిరంగ ర్యాలీ తీయడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. అల్లు అర్జున్ చిరంజీవి మా పార్టీనేనని, ఆయనకు పిల్లనిచ్చిన మామ కూడా మా పార్టీలోనే ఉన్నాడని, మాకు బంధువులు కూడా అవుతారని కానీ చట్టం ముందు అందరూ సమానమే కదా అని రేవంత్‌రెడ్డి అన్నారు.