మీనాక్షి రాకతో.. రేవంత్ కు చెక్?

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గా దీపాదాస్ మున్షీ వెళ్లిపోయి.. మీనాక్షి నటరాజన్ వచ్చారు. అలా రాగానే.. ఇలా అంతా సెట్ చేసే పనిలో పడ్డారు. సీనియర్ల నుంచి అందిన ఫిర్యాదులు.. జూనియర్ల నుంచి పొందిన సలహాలు.. హై కమాండ్ కు దగ్గరగా మెలిగే నేతల నుంచి అందిన రహస్యాలు.. అన్నీ కలగలిపి.. రాష్ట్ర కాంగ్రెస్ ను లైన్ లో పెట్టే పనిలో పడ్డారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఓ పావుగా మాత్రమే మిగిలిపోయారని స్వయానా పార్టీ నేతలే అంటున్నారు. అందుకు చాలా అంశాలను ఉదాహరణగా చూపిస్తున్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ.. అధిష్టానం ప్రయోగాలకు కేంద్రంగా మారిపోయింది. సీనియర్లు కలిసి రాకున్నా.. పీసీసీ చీఫ్ గా ఊరూరా తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి.. ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి.. అధిష్టానం ఆడుకున్న ప్రయోగాల్లో పావుగా మారాల్సి వస్తోంది. కొంతకాలంగా.. ప్రభుత్వ పరంగా చోటు చేసుకున్న పరిణామాలతో పాటు.. పార్టీ పరంగా ఎదురైన అనుభవాలను లెక్కగడుతున్న అధిష్టానం సీరియస్ గా స్పందిస్తున్న క్రమంలో.. రేవంత్ కు పలుకుబడి తగ్గుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాదిగా.. ఆయన పాలనను కాస్త జాగ్రత్తగా గమనిస్తే.. పవర్ లోకి వచ్చిన మొదట్లో ఉన్న జోరు ఇప్పుడు కనిపించకపోవడం.. ఆనాటి దూకుడు ఇప్పుడు దాదాపుగా తగ్గిపోవడం.. అంతా అధిష్టానం కంట్రోల్ చేస్తున్న ఎఫెక్టే అని అంతా అనుకుంటున్నారు. ఎందుకని ఆలోచిస్తే..

2023లో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం.. వచ్చీ రాగానే హైడ్రా అంటూ కూల్చివేతలు మొదలుపెట్టింది. సామాన్యుల నుంచి శాపనార్థాలు అందుకుంది. నిరుపేదల ఇళ్లు కూలగొట్టి వారికి నిలువ నీడ లేకుండా చేసిన ప్రభుత్వంగా మచ్చ తెచ్చుకుంది. ఇళ్లు పోగొట్టుకున్న వారి ఏడుపులు.. జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమయ్యాయి. చివరికి వెనక్కి తగ్గి.. ఇకపై జరిగే అక్రమ నిర్మాణాలను మాత్రమే కూలగొడతామని.. ఇప్పటివరకు కట్టుకున్న వారి ఇళ్లను మాత్రం ముట్టుకోబోమని చెప్పాల్సి వచ్చింది. కానీ.. అప్పటికే హైడ్రా కఠిన చర్యల కారణంగా.. ఉన్న గూడు కోల్పోయి.. రోడ్డున పడ్డ ఎన్నో కుటుంబాలకు.. ప్రభుత్వం ఏం సహాయం చేస్తుందనేది ఇప్పటికీ చెప్పకపోవడం.. మరిన్ని విమర్శలకు కారణమైంది.

ఆ తర్వాత.. హైడ్రాకు మించిన ఎఫెక్ట్.. కులగణన రూపంలో వచ్చింది. రేవంత్ రెడ్డి.. ఈ విషయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా సరే.. కులగణను సక్సెస్ చేసి.. దేశానికే ఓ రోల్ మాడల్ గా నిలవాలని అనుకున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని పిలిపించి మరీ.. సభ పెట్టారు. కానీ.. వాస్తవానికి వచ్చే సరికి మరో కథ జరిగింది. బీసీల కోసమని పెట్టిన ఆ గణన.. బీసీల జనాభానే తగ్గిపోయిందని చెప్పే సరికి.. అసలుకే ఎసరొచ్చే పరిస్థితి ఎదురైంది. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో.. మరోసారి కులగణన నిర్వహించాలని నిర్ణయం తీసుకునే వరకు వెళ్లాల్సి వచ్చింది. ఇది ప్రభుత్వ పరంగా.. కచ్చితంగా వైఫల్యమే అన్న చర్చ ఇప్పటికీ జోరుగా జరుగుతోంది.

వీటికి తోడు.. SLBC ఘటన రేవంత్ ప్రభుత్వానికి మరో శాపంగా మారింది. క్రిటికల్ మేనేజ్ మెంట్ లో ముందుండాల్సిన ప్రభుత్వం.. ఈ విషయంలో కాస్త నిర్లక్ష్యంగానే స్పందించినట్టు కనిపించింది. వ్యవహారాన్ని రెస్క్యూ ఆపరేషన్ల బృందాలకు, ఒకరిద్దరు మంత్రులకు మాత్రమే వదిలేసినట్టుగా కనిపించింది. 9 రోజుల తర్వాత కాకుండా.. ముఖ్యమంత్రి కాస్త ముందే స్పందించి కీలక నిర్ణయాలు తీసుకుని ఉంటే.. కనీసం గల్లంతైనవారి ఆచూకీ అయినా ఇప్పటివరకు తెలిసేదని వారి కుటుంబీకులు అంటున్నారు. ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ పరంగానే కాదు.. పార్టీ పరంగా కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రేవంత్ ను ఇరకాటంలో పెడుతున్నాయి. పీసీసీ చీఫ్ గా ఊరూరా తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడిగా రేవంత్ సీఎం అయినప్పటినుంచి.. ఆయనకు అడుగడుగునా పార్టీ నేతలే అడ్డంకులు సృష్టిస్తున్నారు. చాలా సందర్భాల్లో మంత్రులు ఏ మాత్రం కలిసి రాకపోవడం.. విపక్షాల విమర్శలకు సైతం రేవంత్ మాత్రమే స్పందించడం చూశాం. అధికారిక సమావేశాలకు సీఎం వస్తున్నప్పుడు.. మంత్రులు కనీసం లేచి నిల్చుని స్వాగతం చెప్పేంత మర్యాద కూడా ఇవ్వకపోవడాన్ని సోషల్ మీడియాలో వైరల్ అవడం కూడా చూశాం. SLBC వంటి ఘటనల్లో రేవంత్ తప్ప.. ఇతర నేతలెవరూ గట్టిగా మాట్లాడకపోవడాన్ని కూడా చూస్తున్నాం. మంత్రుల మధ్య సఖ్యత లేదంటూ.. విశ్లేషకులు చెబుతున్న అభిప్రాయాలను కూడా చూస్తున్నాం.

మనకే ఇంత తెలిస్తే.. అధిష్టానానికి ఇంకెంత తెలియాలి? అందుకే.. మీనాక్షి నటరాజన్ వచ్చారు. రాగానే.. అంతా సెట్ చేసే పనిలో పడ్డారు. పార్టీలో ఇలాంటి వ్యవహారాలన్నీ ఒక్కోటిగా దారిలోకి తెస్తున్నారు. ఆ తర్వాతే.. మంత్రి వర్గ విస్తరణ అని కూడా సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే పైరవీకారులను కంట్రోల్ చేశారని.. అనవసర వివాదాలు పార్టీని టచ్ చేయకుండా.. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని కూడా తెలుస్తోంది. ఈ ఆటలో.. రేవంత్ రెడ్డి కూడా పావుగా మారిపోయారే తప్ప.. ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారని సమాచారం అందుతోంది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాత్మక పరిణామాలు కాంగ్రెస్ లో జరిగి.. రేవంత్ ఒంటరిగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని.. అర్థమవుతోంది.

ehatv

ehatv

Next Story