తెలుగు రాష్ట్రాల ప్రయోజనం కాదు.. చంద్రబాబుకు రహస్య ఎజెండానే ముఖ్యం!
ఆంధ్రప్రదేశ్(andhra pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై(Chandrababu) కాంగ్రెస్ పార్టీ(Congress) నాయకురాలు విజయశాంతి(Vijayashanti) పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కంటే తెలుగుదేశంపార్టీ ప్రయోజనాలే రహస్య ఎజెండాగా పెట్టుకునే మొన్న చర్చలకు వచ్చారనే అనుమానం కలుగుతున్నదని విజయశాంతి అన్నారు. తన ఎక్స్ ఖాతాలో (twitter)లో చంద్రబాబు రహస్య ఎజెండాపై పెద్ద పోస్ట్ పెట్టారు. 'ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాదుకు వచ్చారని అందరూ భావించారు. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు రహస్య ఎజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే, తెలంగాణాలో మళ్లీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ. తెలంగాణాలో తెలుగుదేశం బలపడుతుందని చంద్రబాబు అనడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణాల తెలుగుదేశం ఎప్పటికీ బలపడదు కానీ తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామి అయిన బీజేపీ తో కలిసి తెలంగాణలో బలపడటానికి కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునగడంతో పాటు అడ్రస్ గల్లంతయ్యే అవకాశాలు ఉద్యమ తెలంగాణలో తప్పక ఏర్పడి తీరుతాయి. తిరిగి తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్ వాస్తవం...తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగుందని ప్రకటించిన చంద్రబాబు తెలంగాణలో టీడీపీని తిరిగి బలోపేతం చేస్తామని అనవలసిన అవసరం ఏముంది? ' అని విజయశాంతి రాసుకొచ్చారు. చివరగా కూటమి మిత్రపక్షం బీజేపీకి(BJP) కూడా తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన మంచిగున్నది. మీ నాయకులెవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయవలసిన అవసరం లేదు అని చెప్పటం తప్పక సమంజసంగా ఉంటది, బహుశా` అంటూ హర హర మహాదేవ్.. జై తెలంగాణ అని విజయశాంతి తన పోస్ట్‌ను ముగించారు.