Mother Kills Kids: నా పిల్లల బాధను చూడలేకపోతున్నా.. అందుకే వాళ్లను చంపేస్తున్నా.. ఓ తల్లి లేఖ..!

హైదరాబాద్ గాజులరామారంలో ఓ తల్లి తీసుకున్న తీవ్ర నిర్ణయం అందరికీ కంట తడి పెట్టించింది. కొబ్బరిబోండాలు నరికే కత్తితో నరికి పిల్లలను చంపింది. తనకు ఉన్న ఓ అరుదైన కంటి వ్యాధి పిల్లలకు కూడా రావడంతో, ఆ బాధను భరిస్తూ జీవనం సాగిస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన తేజస్విని (35) తన భర్త గాండ్ర వెంకటేశ్వరరెడ్డి, ఇద్దరు కుమారులు అశీష్‌రెడ్డి (7), హర్షీత్‌రెడ్డి (5)లతో కలిసి జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో బాలాజీ లేఅవుట్‌లోని సహస్ర మహేశ్‌ హెయిట్స్‌ అపార్టుమెంట్‌లోని 204 ప్లాట్‌లో ఉంటోంది. అయితే ఇద్దరు కొడుకులు అరుదైన కంటి వ్యాధితో బాధపడుతున్నారు. వారికి ప్రతి రెండు గంటలకోసారి కంట్లో మందు వేయాల్సి ఉంటుంది. లేదంటే, తీవ్ర నొప్పితో విలవిలలాడతారు. తల్లిగా తేజస్వినికి ఇది తట్టుకోలేని బాధ కలిగించింది. పిల్లలు ఏడుస్తుంటే తల్లి కూడా రోదించేది. ప్రతి రోజు వారి నొప్పిని చూసి తన మనశ్శాంతి కోల్పోయింది. ఎవరికీ చెప్పుకోలేక ఒక్కతే రోదించేది. తన పిల్లలకు ఉన్న కంటి వ్యాధికి తానే కారణమనే అభిప్రాయంతో చాలామంది ఆమెను పక్కనబెట్టారు. ఇంట్లో భర్త కూడా ఆమెకు తోడుగా నిలబడలేకపోయాడు. చివరికి చస్తే చావండి అని అనడంతో మనస్తాపం చెందిన తేజస్విని తన ఇద్దరు పిల్లలను హత్య చేసి, తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం వెంకటేశ్వరరెడ్డి డ్యూటీకి వెళ్లగా ఇంట్లో తేజస్విని, ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు కుమారులను కత్తితో నరకిన తర్వాత ఆమె అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తేజస్విని ప్లాటుకు వెళ్లిచూడగా వంటగదిలో ఇద్దరు కుమారులు రక్తపుమడుగులో పడి ఉన్నారు.

తేజస్విని ఇంట్లో పోలీసులు 8 పేజీల ఓ లేఖ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు కంటి సమస్య ఉంది. రెండు గంటలకు ఒకసారి కంట్లో మందు వేయకుంటే పిల్లలు నొప్పితో ఏడుస్తారు. దేవుడా నా పిల్లలకు ఎందుకు ఇంత బాధను ఇచ్చావు? నన్ను అందరూ పిచ్చిది అంటున్నారు. కంటి నొప్పి సమస్యలతో బాధపడుతున్న నా పిల్లలను నేనే చంపుకున్నాను. ఇలాంటి ఏ తల్లికీ రావద్దు. నా పిల్లలు లేని బతుకు నాకు ఎందుకు? నేను కూడా చనిపోతున్నాను. అమ్మా, నాన్నా నన్ను క్షమించు. ఆస్తిలో ఒక్క పైసా కూడా నా భర్తకు ఇవ్వకూడదు. ఆస్తి మొత్తం అనాథలు, స్కూల్‌ పిల్లలకు ఇవ్వండి అంటూ తేజస్విని లేఖలో రాసింది. దీంతో పోలీసులు కూడా ఈ లేఖను చూసి విచారం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Updated On 18 April 2025 6:49 AM GMT
ehatv

ehatv

Next Story