అయ్యో పాపం.. గాలిపటం సరదాకు చిన్నారి ప్రాణం బలి
గాలిపటం కొనుక్కోవాలన్న ఓ బాలుడి సరదా నిండుప్రాణం పోయేలా చేసింది. తెగిన గాలిపటం కోసం బాలుడు పరుగుత్తుతుండగా ట్రాక్టర్ ఢికొని మృత్యువాత పడడంతో విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట బస్టాండ్ దగ్గర ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తెగిన గాలిపటాన్ని అందుకునే క్రమంలో ఎదురుగా ఆగి ఉన్న ట్రాక్టర్‌ను గమనించని బాలుడు పరిగెడుతూ బలంగా ఢీకొనేసరికి ప్రాణాలు కోల్పోయాడు. మెదక్ జిల్లా టెక్మాల్‌కు చెందిన బాలుడు శ్రీరాం వయసు ఎనిమిదేళ్లు, తెగిన గాలిపటం కోసం పైకి చూస్తూ పరిగెడుతూ ట్రాక్టర్‌ను గుద్దుకోవడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. మృతుడు శ్రీరామ్ తండ్రి గతంలో ప్రమాదవశాత్తు కుసంగి చెరువులో పడి మృతిచెందాడు. ఇప్పుడు బాలుడు కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వైద్యులు చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. గాలిపటాలు కొనుక్కోవడానికి టెక్మాల్ నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న జోగిపేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. జోగిపేట పోలీసులు.. టేక్మాల్ పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో బాలుడి కుటుంబంతో పాటుగా గ్రామంలో విషాదం నెలకొంది.