ఎప్పటిలాగే దేవరగట్టు(Devaragattu) ఉత్సవాలలో తలలు పగిలాయి.

ఎప్పటిలాగే దేవరగట్టు(Devaragattu) ఉత్సవాలలో తలలు పగిలాయి. దసరా పండుగను(Dasara Festival) పురస్కరించుకుని శనివారం అర్థరాత్రి 12 గంటలకు మాళమల్లేశ్వరస్వామి కల్యాణం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను దక్కించుకోవడానికి వందలాది మంది భక్తులు కర్రలతో కొట్టేసుకోవడం ఆనవాయితీ. ఈ సమరంలో వంద మందికిపైగా గాయాలయ్యాయి. మరో వంద మంది తీవ్రంగా గాయపడ్డారు. అయిదుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మరోవైపు నిప్పురవ్వలు(Fire) పడి మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దేవరగట్టుపై కొలువైన మాత మాళమ్మ, మల్లేశ్వరుని కల్యాణోత్సవం తర్వాత బన్ని ఉత్సవం వైభవోపేతంగా జరుగుతుంటుంది. దేవరగట్టు ఆలయ నిర్వాహణ బాధ్యత మోస్తున్న పరిసర గ్రామాలైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు భారీ సంఖ్యలో దేవరగట్టుకు చేరుకుంటారు. అక్కడ చెరువుకట్ట (డొళ్లిన బండే) వద్దకు చేరి కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. తర్వాత గ్రామపెద్దలు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న కంట్రోల్‌ రూం వద్దకు వచ్చి కొండపై జరిగే కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా వారికి బండారాన్ని ఇచ్చి వెళతారు. అటు పిమ్మట బాణసంచా పేల్చి ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి కాగడాలు చేతబూని డోలు, మేళతాళాలతో కాడప్ప మఠంలో అప్పటికే అక్కడ ఉంచిన మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళతారు. ఆలయంలో ఉన్న మాళమ్మ ఉత్సవ విగ్రహానికి అర్థరాత్రి కల్యాణోత్సవం జరిపిస్తారు. ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ. ఉత్సవమూర్తులను తీసుకుని జైత్రయాత్ర సాగించడానికి కొండ దిగుతునప్పుడు సమరం మొదలవుతుంది. కర్రలతో ఒకరినొకరు రక్తాలు కారేలా కొట్టుకుంటారు. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు కల్యాణోత్సవం అనంతరం జరిగే ఈ మొగలాయిలో పాల్గొంటారు. మొగలాయిలో కర్రలు తగిలి చాలా మంది గాయపడతారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా ప్రయత్నించినా కర్రల సమరం ఆగడం లేదు. చాలా మంది దివిటీలు మీద పడటం వల్ల గాయపడతారు. తోపులాటలో ఇంకొందరు గాయపడుతుంటారు. గతంలో కొందరు చనిపోయారు కూడా!

Eha Tv

Eha Tv

Next Story