Telangana : మహిళా జర్నలిస్టులపై దాడి ఘటన.. ఐదుగురిపై కేసు నమోదు
నాగర్‌కర్నూల్ జిల్లాలో మహిళా జర్నలిస్టులపై అనుచితంగా ప్రవర్తించి, అసభ్యంగా ప్రవర్తించినందుకు ఐదుగురు వ్యక్తులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు
నాగర్‌కర్నూల్ జిల్లాలో మహిళా జర్నలిస్టులపై అనుచితంగా ప్రవర్తించి, అసభ్యంగా ప్రవర్తించినందుకు ఐదుగురు వ్యక్తులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యవసాయ రుణమాఫీ గురించి రైతుల కష్టాలను నివేదించేందుకు డిజిటల్ మీడియాకు చెందిన మహిళా జర్నలిస్టులు కొండారెడ్డిపల్లికి వెళ్లారు. వారిని కొందరు అడ్డుకోవడమే కాకుండా అనుచితంగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు యాక్షన్ లోకి దిగారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 126(2), 352, 351 (1) 79, r/w 3(5) సెక్షన్‌ల కింద బెదిరింపులు, తప్పుడు నిర్బంధం, మహిళలను ఉద్దేశపూర్వకంగా అవమానించినందుకు కేసు నమోదు చేశారు.
కొందరు వ్యక్తులు తమపై విరుచుకుపడ్డారని.. తమ కెమెరాలు, ఫోన్‌లను లాక్కోడానికి ప్రయత్నించడమే కాకుండా, గ్రామాన్ని సందర్శించవద్దని తమను బెదిరించారని మహిళా జర్నలిస్టులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమపై దాడి చేసిన గ్రామస్తులు కాంగ్రెస్ కార్యకర్తలని ఎక్స్‌లో జర్నలిస్టులు పేర్కొన్నారు. వేధింపులకు గురిచేసి కెమెరాలను ధ్వంసం చేశారని, ఫోన్లను లాక్కుని బురదలోకి నెట్టారని ఆరోపించారు. "తెలంగాణలో మహిళా జర్నలిస్టులపై జరిగిన ఈ దాడిని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా పరిగణిస్తుందని నేను ఆశిస్తున్నాను" అని ఒక జర్నలిస్టు ట్వీట్ చేశారు.