మణికొండలోని(Manikonda) చిత్రపురి కాలనీలో హౌసింగ్ సొసైటీ(Chitrapuri colony housing society) అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్
మణికొండలోని(Manikonda) చిత్రపురి కాలనీలో హౌసింగ్ సొసైటీ(Chitrapuri colony housing society) అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌పై(Vallabhaneni Anilkumar) సైబరాబాద్ ఆర్ధిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) పోలీస్ స్టేషన్‌లో ఒకేసారి 15 కేసులలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సినిమా రంగానికి చెందిన అల్పాదాయ వర్గాల వారికి కేటాయించవల్సిన చిత్రపురి కాలనీ ఫ్లాట్లలో ఆ ఫీల్డ్‌కు సంబంధం లేని వారు జొరబడ్డారన్న ఆరోపణలు కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తున్నాయి. సినీరంగానికి చెందనివారికి కూడా మినిమం రేటుకే ఫ్లాట్లు అమ్మారని, సొసైటీ సభ్యులు కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని సినీ కళాకారులు ఆవేదనతో చెబుతూ వస్తున్నారు.
ఇన్నాళ్లకు వారిపై యాక్షన్ తీసుకుంటున్నారు. చిత్రపురికాలనీలో అనర్హులకు ఫ్లాట్ల కేటాయింపు, సభ్యత్వాలు కేటాయించడం, నిధుల అవకతవకలు సహా అనేక ఉల్లంఘనలపై రాయదుర్గం పోలీసుస్టేషన్‌లో 2021 నుంచి నమోదైన ఈ కేసులన్నింటినీ ఈవోడబ్ల్యూకి బదిలీ చేశారు. అన్ని కేసుల్లో అనిల్‌కుమార్ ప్రధాన నిందితుడు కావడం గమనార్హం. ఈయనతో పాటు సినీరంగానికి చెందిన పరుచూరి వెంకటేశ్వరరావు, కొమరా వెంకటేశ్, వినోద్‌బాల, చంద్రమధు, కాదంబరి కిరణ్, మన్మథరెడ్డి, ప్రవీణ్‌కుమార్ యాదవ్, సత్యనారాయణ దూర, అలహరి వీవీ ప్రసాదరావు, టి.లలిత, కొంగర రామకృష్ణ ప్రసాద్, దీప్తి వాజ్‌పేయి, నిమ్మగడ్డ అనిత, మహానందరెడ్డి, రఘు బత్తుల, జల్లా మధుసూదన్, పీఎస్ కృష్ణమోహన్‌రెడ్డి, కె రాజేశ్వర్‌రెడ్డి, దేవినేని బ్రహ్మానందరావు, కొల్లి రామకృష్ణ, ఉదయ్‌భాస్కర్‌రావు, టి.భరద్వాజ్, పీఎస్‌ఎన్ దొరై, ధాత్రిదేవి, ఆళ్ల హరిలను కూడా వేరువేరే కేసులలో నిందితులుగా చేర్చారు. మణికొండలోని సర్వే నం.246/1లో 67.16 ఎకరాల స్థలాన్ని తెలుగు సినీకార్మికుల సహకార హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం కేటాయించింది. గజానికి 40 రూపాయల ధరతో ప్రభుత్వం ఈ స్థాలాన్ని ఇచ్చింది. 2002లో సొసైటీ సభ్యత్వ ప్రక్రియ మొదలుపెట్టింది. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా మూడు విభాగాలలో నివాసాలు నిర్మించాలని అనుకున్నారు. మొత్తం 4300 మంది సభ్యులుగా చేరారు. తక్కువ ధరకు వచ్చిన భూమి ధర కాలక్రమంలో బాగా పెరిగింది. దాంతో అక్రమాలకు తెర లేచింది. సొసైటీలో సభ్యులకు ఫ్లాటు కేటాయింపునకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సహకార శాఖ, ప్రజాసంబంధాల శాఖ కమిషనర్లు, ఇద్దరు సినీ ప్రముఖులతో కూడిన కమిటీ సంతకాలుండాలి. 2010, 2012, 2015లో ఆరుదశల్లో 4213 ఫ్లాట్ల కేటాయింపు పూర్తయింది. భూముల ధరలకు రెక్కలు రావడంతో కమిటీ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ అనర్హులకు ఫ్లాట్లు కేటాయించారు. మరో విషయమేమిటంటే 4213 ఫ్లాట్లకు 9153 మందిని సొసైటీలో సభ్యులుగా చేర్పించడం. రాజకీయ నేతల సూచనలతో అనర్హులను చేర్పించారని అంటున్నారు. సొసైటీ సభ్యులు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కూడా లంచాలు తీసుకున్నారట!