ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీ సోమవారంతో ముగిసింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీ సోమవారంతో ముగిసింది. దీంతో మంగళవారం ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం కవితకు ఏప్రిల్ 9 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మొత్తం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపింది. జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో కవితను తిహార్ జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇదిలావుంటే కోర్టులో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తనపై పెట్టింది మనీలాండరింగ్ కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని పేర్కొన్నారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు కానీ.. తన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారని.. మరొకరికి లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ టికెట్ ఇచ్చిందని.. మూడో నిందితుడు కేసు నుంచి బయటపడేందుకు రూ. 50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి అందజేశారని ఆరోపించారు. తనపై చట్టవిరుద్ధంగా తప్పుడు కేసు బనాయించారని.. న్యాయపోరాటం చేసి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తెలిపారు.