సోషల్‌ మీడియాలో బర్రెలక్క(Barrelakka )గా పాపులరైన కర్నె శిరీష అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడంతో మరింత ప్రాచుర్యం పొందారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న ఈ 26 ఏళ్ల యువతికి వివిధ వర్గాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా ఉనన నిరుద్యోగులు ఆమెకు జై కొడుతున్నారు.

సోషల్‌ మీడియాలో బర్రెలక్క(Barrelakka )గా పాపులరైన కర్నె శిరీష అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడంతో మరింత ప్రాచుర్యం పొందారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న ఈ 26 ఏళ్ల యువతికి వివిధ వర్గాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా ఉనన నిరుద్యోగులు ఆమెకు జై కొడుతున్నారు. అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఆమెకు మద్దతు ఇస్తున్నారు. యానాం మాజీ మంత్రి, ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆమెకు ఆర్ధిక సాయం కూడా చేశారు. ప్రచార ఖర్చుల కోసం లక్షల రూపాయలు పంపించారు. ఆమె విజయం సాధించాలని బలంగా కోరుకుంటున్నవారు తమకు చేతనైన సాయం చేస్తున్నారు. తాను నిరుద్యోగుల తరపున పోరాడేందుకే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచానని శిరీష ప్రకటించారు. ఏ సోషల్‌ మీడియా అయితే ఆమెను పాపులర్‌ చేసిందో అదే సోషల్‌ మీడియాలో ఆమెకు విపరీతమైన స్పందన లభిస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి నిరుద్యోగులు సొంత ఖర్చులతో కొల్లాపూర్‌కు వచ్చి స్వచ్ఛందంగా శిరీషకు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న శిరీష తమ్ముడు చింటూపై కొందరు యువకులు దాడికి దిగారు. ఈ ఘటనపై నిరుద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే బహుజన సమాజ్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ దీనిని తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శిరీషకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ కూడా శిరీషకు రక్షణ కల్పించాలని అన్నారు. 'హాయ్‌ ఫ్రెండ్స్‌.. డిగ్రీలు ఎన్ని వచ్చినా నోటిఫికేషన్లు రావడం లేదు. ఉద్యోగాలు రావడం లేదు. ఈ విషయం మా అమ్మకు చెబితే నాలుగు బర్లను కొనిచ్చింది. బర్లను కాయడానికి వచ్చిన ఫ్రెండ్స్‌' అంటూ ఏడాదిన్నర కిందట శిరీష చేసిన వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామానికి చెందిన శిరీష బికాం చదివారు. తల్లి అనూరాధ ఓ చిన్న టిఫిన్‌ సెంటర్‌ను నడుపుతున్నారు. చిన్న రేకుల షెడ్డులో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబానికి తల్లితో పాటు తాను కూడా పెద్ద దిక్కులా నిలవాలని శిరీష అనుకున్నారు. పోలీస్‌ కానిస్టేబుల్‌, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అయ్యారు. అయితే ఉద్యోగాల నోటిఫికేషన్లు రాలేదంటూ అప్పట్లో ఈమె చేసిన వీడియోపై పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 505(2) సెక్షన్‌ కింద కేసు కూడా నమోదయ్యింది. తెలంగాణలో నోటిఫికేషన్లు రాక, నియామకాల ప్రక్రియ సక్రమంగా లేక ఉద్యోగాలు రావడం లేదని, నిరుద్యోగుల తరపున తాను అసెంబ్లీ ఎన్నికలబరిలో నిలిచానని శిరీష చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యావంతురాలుగా తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు శిరీష..

Updated On 23 Nov 2023 2:49 AM GMT
Ehatv

Ehatv

Next Story