Scientist Stephen Hawking : ఒకప్పుడు అంగారకుడిపై జీవం ఉండేదా?
ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో వందేళ్ల తర్వాతైనా మనిషి అంకారకుడి(Mars) మీద నివాసమేర్పరుచుకోవడం ఖాయమన్నారు విఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్(Scientist Stephen Hawking). కాలనీలు ఏర్పరుచుకుని ఆ గ్రహాన్నే నివాసయోగ్యంగా మలచుకుంటాడని ఆ సైంటిస్ట్ భవిష్యత్తును ఊహిస్తూ చెప్పారు.

Scientist Stephen Hawking
ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో వందేళ్ల తర్వాతైనా మనిషి అంకారకుడి(Mars) మీద నివాసమేర్పరుచుకోవడం ఖాయమన్నారు విఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్(Scientist Stephen Hawking). కాలనీలు ఏర్పరుచుకుని ఆ గ్రహాన్నే నివాసయోగ్యంగా మలచుకుంటాడని ఆ సైంటిస్ట్ భవిష్యత్తును ఊహిస్తూ చెప్పారు. ఆ ఊహ నిజం కావొచ్చేమో! కుజ గ్రహం మీద పరిశోధనలు చేస్తున్న క్యూరియాసిటీ రోవర్ లేటెస్ట్‌గా కొన్ని కీలకమైన విశేషాలను సేకరించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా(NASA) పంపిన ఆ రోవర్ కుజుని ఉపరితలంపై పురాతన పగుళ్లను కనిపెట్టింది. ఆ పగుళ్లను ఫోటోలు, వీడియోలు తీసి భూమికి పంపించింది.
ఇప్పటికీ ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఉన్న ఆ పగుళ్లను చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. ఒకదాని వెంట ఒకటిగా వచ్చివెళ్లే తడి, పొడి ఆవర్తనాలకు సంకేతాలైన ఇలాంటి పగుళ్లు జీవం పుట్టుకకు అత్యంత అనుకూలమని సైంటిస్టులు అంటున్నారు. మనకున్నట్టే కుజుడిపై రుతువులు ఉండేవట! రుతువులు ఉన్నప్పుడు కాలాలు(Seasons) కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా ఉన్నాయని అంటున్నారు సైంటిస్టులు. అత్యంత పురాతన కాలం నాటి బురదమయమైన షట్కోణాకృతిలోని పగుళ్లను క్యూరియాసిటీ రోవర్(curiosity Rover) కనిపెట్టింది. వీటిని తొలినాటి కుజునిపై తడి, పొడి ఆవర్తనాల తాలూకు ఆనవాళ్లుగా భావిస్తున్నారు.
జీవం పుట్టుకకు ఇవి అత్యంత కీలకం. దాంతో పాటే ఎంతో అనుకూలం కూడా! భూమిపై మాదిరిగా కుజునిపై క్రమానుగతంగా తడి, పొడి ఋతువులు, మరోలా చెప్పాలంటే వేసవి, వానాకాలాలు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తూ పోతూ ఉండేవి. అందుకు నిదర్శనాలే ఈ ఆవర్తనాలు అని పరిశోధనకు సారథ్యం వహించిన విలియం రేపిన్(William Rapin) అన్నారు. బురద ఎండిపోయిన కొద్దీ కుంచించుకుపోయి, పగుళ్లిచ్చి టీ ఆకారపు జంక్షన్ మాదిరిగా ఏర్పడ్డాయి. పదే పదే నీరు పారిన తర్వాత వై అకృతిలోకి మారాయి. చివరగా షట్కోణాకృతిలోకి మారి గట్టిపడ్డాయి.
వీటిని చూస్తే మన భూమిపైలాగే అక్కడ కూడా ఎండ, వాన కాలాలు క్రమం తప్పకుండా వచ్చేవని తెలుస్తుందని రేపిన్ అన్నారు.' భూమి మాదిరిగా కుజునిపై టెక్టానిక్ ఫలకాలు లేవు. కనుక ఆ గ్రహం తాలూకు పురాతన చరిత్ర సురక్షితంగా ఉంది’ అని చెప్పారు. ఈ పరిశోధన ఫలితాలను నేచర్ జర్నల్‌లో తాజాగా ప్రచురించారు. జీవం తాలూకు ఆనవాళ్లు కుజుడిలో ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి. కుజ గ్రహం మన భూమికి ఇంత దగ్గరగా ఉండటం ఓ రకంగా మన అదృష్టం. విశ్వ రహస్యాలను ఛేదించే క్రమంలో ఇది పెద్ద ముందడుగు అవుతుందని రేపిన్ పేర్కొన్నారు.
