ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగుల చావుకొచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగుల చావుకొచ్చింది. సృష్టించిన మనిషికే అగచాట్లు పెడుతోంది. కృత్రిమ మేథ ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐ మీద డిపెండ్ అవ్వడం మొదలు పెట్టాయి. ఉద్యోగుల కార్యకలాపాల స్థానంలో ఏఐని నియమించుకుంటున్నాయి. ఉద్యోగులను తొలగిస్తున్నాయి. థర్డ్‌పార్టీ ఆన్‌లైన్ పేమెంట్ సేవల సంస్థ ఫోన్‌పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ కార్యకలాపాల్లో 90 శాతం ఏఐ చాట్‌బాట్‌లను వినియోగిస్తోంది. గత అయిదేళ్లలో ఈ సంస్థ 60 శాతం ఉద్యోగులను తొలగించింది. ఇంతకు ముందు 1,100 మంది ఉద్యోగులు ఉంటే ఇప్పుడు అక్కడ 400 మందే ఉన్నారు. ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కస్టమర్ సర్వీస్ విభాగంలో ఇలా ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఏఐకు శిక్షణ ఇచ్చే విభాగంలో సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు దొరకడం లేదన్నారు. ఇప్పటికే సర్వీస్ విభాగంలో పని చేస్తున్నవారు నిరాశ పడకుండా తమ రంగంలో ఏఐకు శిక్షణ ఇవ్వడం నేర్చుకోవాలని సూచిస్తున్నారు.