World Cup Semi Final Ind vs NZ : నేడు ప్రపంచ కప్ తొలి సెమీస్.. కివీస్‌తో తలపడనున్న టీమిండియా
ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2023 మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు జరుగనుంది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు వరుసగా రెండోసారి సెమీఫైనల్‌లో తలపడుతున్నాయి.

World Cup Semi Final 2023 India Vs New Zealand Playing XI Captain And Players
ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్(World Cup) 2023 మొదటి సెమీ-ఫైనల్(Semi Final) మ్యాచ్ భారత్(India), న్యూజిలాండ్(Newzealand) జట్ల మధ్య నేడు జరుగనుంది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు వరుసగా రెండోసారి సెమీఫైనల్‌లో తలపడుతున్నాయి. 2019 వన్డే ప్రపంచ కప్‌లో మొదటి సెమీ-ఫైనల్ కూడా ఈ రెండు జట్ల మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఈసారి సొంతగడ్డపై గెలిచి నాలుగేళ్ల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ప్రయత్నిస్తుంది.
ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. లీగ్ దశలో భారత్ ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి అజేయంగా నిలిచి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. మొత్తం టోర్నీలో భారత జట్టు కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే మార్పులతో బరిలోకి దిగింది. తొలి మ్యాచ్‌లో ఆడిన అశ్విన్ స్థానంలో శార్దూల్‌కు రెండో మ్యాచ్‌లో అవకాశం దక్కింది. నాలుగో మ్యాచ్‌లో హార్దిక్(Hardik Pandya) గాయపడ్డాడు. దీంతో శార్దూల్(Shardul Thakur), హార్దిక్ స్థానంలో మహమ్మద్ షమీ(Mohammad Shami), సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)లను జట్టులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత ఒకే జట్టుతో భారత్ వరుసగా ఐదు మ్యాచ్‌లు ఆడి అన్ని మ్యాచ్‌లను సులభంగా గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లో కూడా టీమ్ ఇండియాలో మార్పుకు అవకాశం లేదు. ఓపెనింగ్ జోడీ రోహిత్(Rohit), గిల్(Gill) అద్భుతాలు చేస్తున్నారు. మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేసే విరాట్(Virat Kohli) ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) నాలుగో స్థానంలో ఆడుతూ 400కు పైగా పరుగులు చేశాడు. ఐదో స్థానంలో ఉన్న రాహుల్(KL Rahul) ట్రబుల్ షూటర్ పాత్రను చాలా చక్కగా పోషిస్తున్నాడు. ఆరో నంబర్‌లో ఉన్న సూర్యకుమార్(Surya Kumar Yadav) కూడా అవకాశం దొరికినప్పుడు తన పనిని చక్కగా నిర్వర్తించాడు. రవీంద్ర జడేజా(Ravindra Jadeja) కూడా ఏడో నంబర్‌లో మ్యాచ్‌ను అద్భుతంగా ముగించగలడు. రవీంద్ర జడేజా బంతితో కూడా అద్భుతాలు చేస్తున్నాడు. కుల్దీప్‌తో కలిసి మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ త్రయం చరిత్ర సృష్టిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయడం చాలా కష్టం.
న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులకు కూడా అవకాశం లేదు. రచిన్, కాన్వే ఓపెనింగ్ చేయడం ఖాయం. కెప్టెన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఆడతాడు. నాల్గవ స్థానంలో డారిల్ మిచెల్, ఐదవ స్థానంలో లాథమ్ స్థానం కూడా నిర్ధారించబడింది. ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్, సౌథీ బౌలింగ్‌లో రాణిస్తుండగా.. సాంట్నర్ ఒక ఎండ్ నుండి స్పిన్ బాధ్యత తీసుకుంటాడు. అటువంటి పరిస్థితితులలో మార్క్ చాప్‌మన్ స్థానంలో జేమ్స్ నీషమ్ లేదా ఇష్ సోధికి అవకాశం ఇవ్వవచ్చు. నీషమ్ అద్భుతమైన ఆల్ రౌండర్.. బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా.. ఉపయోగకరమైన ఫాస్ట్ బౌలర్ కూడా... సోధి మంచి స్పిన్నర్.. భారత్‌పై అతని రికార్డు కూడా బాగుంది. ఒకవేళ కివీస్ ముందుగా బౌలింగ్ చేస్తే సోధీకి అవకాశం దక్కవచ్చు. రెండో ఇన్నింగ్సులో బౌలింగ్ చేస్తే నీషమ్ ఆడే అవకాశం ఉంది.
రెండు జట్లలో ప్లేయింగ్ 11
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్:
డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్.
