ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కు ముందు ఆఫ్ఘనిస్థాన్ తో భారత్ టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌కు కొంతమంది సీనియర్ ఆటగాళ్లు తిరిగి భారత జట్టులోకి వచ్చారు.

ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌(World Cup)కు ముందు ఆఫ్ఘనిస్థాన్‌(Afghanistan)తో భారత్(Team India) టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌కు కొంతమంది సీనియర్ ఆటగాళ్లు తిరిగి భారత జట్టులోకి వచ్చారు. వీరిలో రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఉన్నారు. కెప్టెన్‌గా రోహిత్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. వీరిద్దరూ నవంబర్ 2022 నుంచి ఏ టీ20 సిరీస్‌ ఆడలేదు. ఇప్పుడు ఇద్దరూ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో క‌నిపించ‌నున్నారు. అయితే రాక కాకుండా.. ఇప్పుడు మరో చర్చ మొదలైంది. రోహిత్‌తో కలిసి విరాట్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడంపై చర్చ జరుగుతోంది.

2021, 2022 టీ20 ప్రపంచకప్‌లకు ముందు రోహిత్‌తో కలిసి విరాట్‌ ఓపెనింగ్‌ చేయాలనే చర్చ సాగింది. 2021లో అప్పుడు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కూడా ఇందుకోసం ప్రత్యేకంగా సన్నాహాలు చేశాడు. కోహ్లీ గ‌తంలో ఓపెనర్‌గా ఐపీఎల్‌లో ఆడాడు. అందులో భాగంగానే ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేశాడు. కేఎల్ రాహుల్(KL Rahul) రెండు ప్రపంచకప్‌లలో రోహిత్‌తో ఓపెనర్‌గా ఆడాడు. ప్ర‌స్తుతం రోహిత్‌, కోహ్లీ జోడి క‌ట్టాల‌ని జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

టీ20 ఇంటర్నేషనల్‌లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు అద్భుతంగా ఉంది. కోహ్లీ ఓపెన‌ర్‌గా తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 57.14 సగటు, 161.29 స్ట్రైక్ రేట్‌తో 400 పరుగులు చేశాడు. వీటిలో మూడుసార్లు 50 కంటే ఎక్కువ ప‌రుగులు చేశాడు. ఆసియా కప్ టీ20 సిరీస్‌లో కొట్టిన సెంచ‌రీ(122 పరుగులు) కూడా కోహ్లీ ఓపెన‌ర్‌గా వ‌చ్చిన‌ప్పుడే ఆడిన ఇన్నింగ్సు కావ‌డం విశేషం.

రాహుల్, రోహిత్‌లతో సహా ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లతో కోహ్లీ ఇప్పటివరకు టీ20ల‌లో భారత్‌కు ఓపెనింగ్ చేశాడు. రాహుల్, విరాట్‌లు ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌ల్లో 209 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇందులో సెంచరీ భాగస్వామ్యం కూడా ఉంది. విరాట్ రోహిత్‌తో ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ టీ20లో వీరిద్దరూ తొలి వికెట్‌కు 94 పరుగులు జోడించారు. ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిస్తే అంత‌కంటే అద్భుతంగా ఆడ‌గ‌ల‌ర‌ని చ‌ర్చ జ‌రుగుతుంది.

కోహ్లీ శిఖర్ ధావన్(Shikhar Dhawan) తో 2017లో గౌతమ్ గంభీర్(Gautham Gambir) తో 2012లో మురళీ విజయ్(Murali Vijay) తో 2011 లో ఓపెనింగ్ చేశాడు. విరాట్ ధావన్‌తో 64 పరుగులు, గంభీర్‌తో 26 పరుగులు, విజయ్‌తో 18 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఓపెనింగ్‌లో విరాట్ 98 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో 15 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. 43.51 సగటుతో 135.45 స్ట్రైక్ రేట్‌తో 3,611 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఓపెన‌ర్‌గా రోహిత్ ఎన్ని అద్భుతాలు సృష్టించాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇదిలావుంటే ఇటీవల శుభ్‌మాన్ గిల్‌(Shubhman Gill) పెద్దగా ఆడలేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ విఫ‌ల‌మ‌య్యాడు. అదే సమయంలో యశస్వి జైశ్వాల్‌(Yashaswi Jaishwal)కి అనుభవం లేదు. దీంతో టాప్ ఆర్డర్‌లో ఇద్దరు అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్ రావడం వల్ల ప్రత్యర్థి జట్టు ఒత్తిడికి లోనవుతుందని అంద‌రూ భావిస్తున్నారు. వీరిద్దరికీ ఈ ప్రపంచకప్ చివరి పరిమిత ఓవర్ల ప్రపంచకప్ కానుందని చ‌ర్చ కూడా న‌డుస్తోంది. ఇటువంటి పరిస్థితుల‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లిద్దరూ జట్టుకు శుభారంభం అందించే బాధ్యతను తీసుకుంటే బాగుంటుంద‌ని.. టీమిండియా మేనేజ్‌మెంట్ ఆ దిశ‌గా ప్ర‌యాత్నాలు చేయాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Updated On 9 Jan 2024 11:01 PM GMT
Yagnik

Yagnik

Next Story