గత కొద్దిరోజులుగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయట కనిపించింది చాలా తక్కువ

గత కొద్దిరోజులుగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయట కనిపించింది చాలా తక్కువ. ఇటీవలే రెండో బిడ్డకు అనుష్క శర్మ జన్మనివ్వడంతో కోహ్లీ బయట కనిపించలేదు. అలాగే ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు విరాట్ దూరమయ్యాడు. ఇక మెన్స్ ఐపీఎల్ త్వరలోనే ప్రారంభం కాబోతూ ఉండడంతో కోహ్లీ ఇక ప్రాక్టీస్ కు వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. అయితే విరాట్ కోహ్లీ వీడియో కాల్ రూపంలో కనిపించి అభిమానులను షాక్ కు గురి చేశాడు. స్మృతి మంధాన అండ్ కో 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించిన తర్వాత వీడియో కాల్ చేసి మాట్లాడాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో డీసీని ఓడించి తొలి డబ్ల్యుపిఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. కోహ్లీ వీడియో కాల్ ద్వారా RCB ఆటగాళ్లతో కలిసి WPL టైటిల్ సెలెబ్రేషన్స్ లో చేరాడు. RCB 16 ఏళ్ల సుదీర్ఘ ట్రోఫీ ఎదురుచూపులు ఫలించాయి. ఇక కోహ్లీ మొదటి నుండి బెంగళూరుకే ఆడుతూ వస్తున్నాడు.

ఫైనల్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. శ్రేయాంక పాటిల్ సూపర్ స్పెల్ తో అదరగొట్టింది. శ్రేయాంక 3.3 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. సోఫీ మోలినాక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లతో సత్తా చాటారు. ఢిల్లీ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు కెప్టెన్ మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ తొలి వికెట్ కు 7.1 ఓవర్లలో 64 పరుగులు జోడించి శుభారంభం అందించారు. కానీ షెఫాలీ అవుటయ్యాక ఢిల్లీ జట్టు 49 పరుగుల వ్యవధిలో 10 వికెట్లను చేజార్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఆర్సీబీ జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. 114 పరుగుల విజయలక్ష్యాన్ని బెంగళూరు జట్టు 19.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్సీబీ ఛేజింగ్ లో టాపార్డర్ రాణించింది. ఓపెనర్లు కెప్టెన్ స్మృతి మంధన 31, సోఫీ డివైన్ 32, ఎలిస్ పెర్రీ 35 (నాటౌట్), రిచా ఘోష్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే 1, మిను మణి 1 వికెట్ తీశారు.

Updated On 17 March 2024 8:54 PM GMT
Yagnik

Yagnik

Next Story