BCCI Coach Hunt: బీసీసీఐ వేట మొదలెట్టింది.. హెడ్ కోచ్ అయ్యేది ఎవరో?
భారత క్రికెట్ సీనియర్ పురుషుల జట్టు హెడ్ కోచ్ పోస్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి
భారత క్రికెట్ సీనియర్ పురుషుల జట్టు హెడ్ కోచ్ పోస్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దరఖాస్తుల్ని ఆహ్వానించింది. ప్రస్తుతం టీమిండియా కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం టీ20 వరల్డ్‌కప్‌తో ముగుస్తుంది. జూన్ చివరి నాటికి ద్రావిడ్ కోచ్‌గా వైదొలుగుతారు. కొత్త కోచ్ పదవీకాలం ఈ ఏడాది జులై 1 నుంచి 2027 డిసెంబర్ 31వ తేదీ వరకు ఉంటుందని బీసీసీఐ తెలిపింది. హెడ్ కోచ్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి.. కనీసం 30 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలని తెలిపింది. లేదా టెస్టు క్రికెట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్‌గా కనీసం 2 సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉండాలని తెలిపింది. ఐపీఎల్ జట్టు లేదా సమానమైన ఇంటర్నేషనల్ లీగ్/ఫస్ట్ క్లాస్ జట్లకు/ జాతీయ A జట్లకు ప్రధాన కోచ్‌గా కనీసం మూడేళ్లు పనిచేసి ఉండాలని తెలిపింది. అదీ కాకుండా బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. వయసు ప్రకారం కోచ్ కు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలని బీసీసీఐ తెలిపింది.
కొత్త కోచ్‌కు 14-16 మంది సహాయక సిబ్బంది ఉంటారని.. మూడు ఫార్మాట్లలో జట్టుకు హెడ్ కోచ్ గా కొనసాగుతాడని బీసీసీఐ తెలిపింది. టీమ్ ప్రదర్శన, నిర్వహణకు ప్రధాన కోచ్ పూర్తి బాధ్యత వహిస్తాడని వివరించింది. అలాగే స్పెషలిస్ట్ కోచ్‌లు, సహాయక సిబ్బంది బృందానికి నాయకత్వం వహిస్తాడు. భారత జట్టులోని క్రమశిక్షణా కోడ్లను సమీక్షించడం, నిర్వహించడం, అమలు చేయడం ప్రధాన కోచ్ బాధ్యతని బీసీసీఐ తెలిపింది.