☰
✕
టీ20 ప్రపంచ కప్ లో నేపాల్ ఓ గొప్ప అవకాశాన్ని కోల్పోయింది. ఒక్క పరుగుతో నేపాల్ జట్టు దక్షిణాఫ్రికా జట్టు చేతిలో ఓటమి పాలైంది. అలాగే సూపర్ 8కు వెళ్లే అవకాశాన్ని కూడా కోల్పోయింది. T20 వరల్డ్ కప్ 2024 గ్రూప్ D మ్యాచ్‌లో నేపాల్‌ను 1 పరుగుతో ఓడించింది దక్షిణాఫ్రికా. జూన్ 15, సెయింట్ విన్సెంట్‌లోని కింగ్‌స్‌టౌన్‌లోని ఆర్నోస్ వేల్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ రోలర్-కోస్టర్ రైడ్ లాగా సాగింది. గ్రూప్ దశలో నాలుగో విజయంతో దక్షిణాఫ్రికా టేబుల్ టాపర్ గా నిలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు నేపాల్‌పై 115 పరుగులు మాత్రమే చేశారు. రీజా హెండ్రిక్స్ మినహా, దక్షిణాఫ్రికా బ్యాటర్‌లలో చాలా మంది రాణించలేకపోయారు. హెండ్రిక్స్ 49 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఎయిరీ 4-0-21-3 గణాంకాలతో అద్భుతమైన బౌలింగ్ వేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ 18 బంతుల్లో అజేయంగా 27 పరుగులు చేయడం వల్ల దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 115 పరుగులు చేసింది.
ఇక ఛేజింగ్ లో ఒకానొక దశలో నేపాల్ విజయం దిశగా సాగింది. భుర్టెల్, ఆసిఫ్ షేక్ 35 పరుగుల భాగస్వామ్యంతో పరుగుల వేటలో నేపాల్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆసిఫ్ 49 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 42 పరుగులు చేసి రాణించాడు. రోహిత్ పౌడెల్ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. అయితే ఆసిఫ్, అనిల్ సాహ్ మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించి నేపాల్ కు విజయాన్ని దగ్గర చేశారు. నేపాల్‌కు 38 బంతుల్లో 30 పరుగులు అవసరం కావడంతో.. తబ్రైజ్ షమ్సీ మ్యాచ్ ను మలుపుతిప్పాడు. 4-0-19-4 గణాంకాలతో నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. నేపాల్ విజయానికి చివరి ఓవర్‌కు 8 పరుగులు కావాల్సి వచ్చింది. చివరి బంతికి ఝా ఒక్క పరుగు చేయడంలో విఫలమయ్యాడు. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా కేవలం ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ గెలిచి ఉండి ఉంటే ఇప్పుడిప్పుడు క్రికెట్ లో అడుగులు వేస్తున్న నేపాల్ జట్టుకు భారీ విజయం అయి ఉండేది.
Eha Tv
Next Story