AFG vs AUS : చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి ఆస్ట్రేలియాను ఓడించింది.!
టీ20 ప్రపంచకప్ 2024లో పెను సంచలనం నమోదైంది. ఈ ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆస్ట్రేలియా తలపడింది.
టీ20 ప్రపంచకప్ 2024లో పెను సంచలనం నమోదైంది. ఈ ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆస్ట్రేలియా తలపడింది. సూపర్-8లో ఇది ముఖ్యమైన మ్యాచ్. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ 148 పరుగులు చేసింది. జవాబుగా ఆస్ట్రేలియా జట్టు 127 పరుగులకే కుప్పకూలింది. తద్వారా ఆఫ్ఘనిస్థాన్ జట్టు చరిత్ర సృష్టించింది.
రషీద్ ఖాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాను ఓడించింది. అదే ఆస్ట్రేలియాపై గత సంవత్సరం ODI ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో విజయానికి చేరువైంది., కానీ మాక్స్‌వెల్ వారి నుండి విజయాన్ని లాగేసుకున్నాడు. అయితే, ఈసారి ఆఫ్ఘనిస్తాన్ అలాంటి పొరపాటు చేయలేదు. కింగ్‌స్‌టౌన్‌లో ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో ఓడించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ 60 పరుగులు, ఇబ్రహీం జద్రాన్ 51 పరుగులు చేశారు. అనంతరం ఆస్ట్రేలియా జట్టు 19.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘనిస్థాన్ జట్టులో గుల్బాదిన్ నైబ్ నాలుగు వికెట్లు తీశాడు.
చేధనలో ఆస్ట్రేలియా జట్టు 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత గ్లెన్ మాక్స్‌వెల్ మార్కస్ స్టోయినిస్‌తో కలిసి 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. స్టోయినిస్‌ను అవుట్ చేయడం ద్వారా నాయబ్ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. ఇక్కడి నుంచి మ్యాచ్ మారిపోయింది. మాక్స్‌వెల్ తన T20 అంతర్జాతీయ కెరీర్‌లో 11వ అర్ధ సెంచరీని సాధించాడు. మాక్స్‌వెల్ మరోమారు ఆఫ్ఘనిస్తాన్ విజయాన్ని అడ్డుకుంటాడని అనుకున్నారు.. కానీ గుల్బాదిన్.. మాక్స్‌వెల్‌ను ఔట్ చేయడం ద్వారా ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చల్లాడు.
మ్యాక్స్‌వెల్ మినహా ఏ ఆటగాడు పెద్దగా రాణించలేదు. ట్రావిస్ హెడ్ (0), డేవిడ్ వార్నర్ (3), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12), మార్కస్ స్టోయినిస్ (11), టిమ్ డేవిడ్ (2), మాథ్యూ వేడ్ (5), పాట్ కమిన్స్ (3), అష్టన్ అగర్ (2), ఆడమ్ జంపా (9) అంతా విఫలమయ్యారు. అఫ్ఘానిస్థాన్ ఈ విజయంతో సూపర్-8 గ్రూప్-1లో సెమీఫైనల్ పోరు ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌లు రెండేసి పాయింట్లతో ఉన్నాయి. ఆస్ట్రేలియా తన చివరి సూపర్-8 మ్యాచ్‌ని భారత్‌తో, ఆఫ్ఘనిస్థాన్ బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంది. రెండు జట్లూ గెలవాలి. ఇరు జట్లు ఓడిపోతే నెట్ రన్ రేట్ ద్వారా సెమీపైనల్ బెర్త్ ఖరారు కానుంది.