దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచ కప్‌-2023లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించింది. బుధ‌వారం తన ఏడవ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 190 పరుగుల తేడాతో ఓడించింది.

దక్షిణాఫ్రికా(South Africa) జట్టు ప్రపంచ కప్‌-2023లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించింది. బుధ‌వారం తన ఏడవ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌(New Zealand)ను 190 పరుగుల తేడాతో ఓడించింది. న్యూజిలాండ్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ విజ‌యంతో దక్షిణాఫ్రికా భారత్‌(India)తో సమానంగా ఆరో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది.

ఇదిలావుంటే.. న్యూజిలాండ్ వరుస ఓటములతో సెమీఫైనల్ పోరు చాలా ఆసక్తికరంగా మారింది. కివీస్‌ జట్టు అత్యంత బలమైన జట్టుగా పరిగణించ‌బ‌డ‌గా.. వరుస పరాజయాలు సమీకరణాలను మార్చేలా ఉన్నాయి. గురువారం శ్రీలంకను టీమిండియా ఓడిస్తే మళ్లీ నంబర్ 1 జట్టుగా అవతరిస్తుంది. 1999 ప్రపంచకప్ తర్వాత ఇరు జట్లు మొత్తం 6 సార్లు తలపడగా.. తొలిసారిగా దక్షిణాఫ్రికా న్యూజిలాండ్‌ను ఓడించింది. కాగా వన్డేల్లో పరుగుల పరంగా న్యూజిలాండ్ నాలుగో అతిపెద్ద ఓటమిని చవిచూసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన‌ దక్షిణాఫ్రికా జట్టు 357 పరుగుల భారీ స్కోరు సాధించింది. క్వింటన్ డి కాక్(Quinton De Cock), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(Dussen) అద్భుత సెంచరీలు చేశారు. డి కాక్ 114, డస్సెన్ 133 పరుగులు చేశారు. చివర్లో మిల్లర్(Miller) 30 బంతుల్లో 53 బంతుల్లో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి కివీస్ జట్టుకు 358 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చేధ‌న‌కు దిగిన‌ న్యూజిలాండ్ జ‌ట్టు కేవ‌లం 35.3 ఓవర్లలోనే 167 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో కేశవ్ మహరాజ్(Keshav Maharaj) 4 వికెట్లు, మార్కో జాన్సెన్(Marco Janson) మూడు వికెట్లు తీశారు. ప్ర‌పంచ‌క‌ప్‌లో న్యూజిలాండ్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ జట్టు తొలి నాలుగు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఓట‌మితో న్యూజిలాండ్ పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానానికి ప‌డిపోయింది. నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకున్న ఆస్ట్రేలియా లాభపడింది. పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్‌ మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. న్యూజిలాండ్‌ ఒక మ్యాచ్‌లో ఓడితే.. సమీకరణాలు పూర్తిగా మారుతాయి.

న్యూజిలాండ్ తదుపరి మ్యాచ్‌ని నవంబర్ 4న పాకిస్థాన్‌తో ఆడనుంది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే కివీస్ జట్టు ప్రమాదంలో పడే అవ‌కాశం ఉంది. పాకిస్థాన్ ఓడిపోతే న్యూజిలాండ్ సులభంగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాక్ జట్టు గెలిస్తే.. న్యూజిలాండ్ పాకిస్థాన్ చేతిలో ఓడి శ్రీలంకపై గెలిస్తే, ఇరు జట్లు 10-10 పాయింట్లతో ఉంటాయి.. ఈ పరిస్థితిలో నెట్ రన్ రేట్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు.

Updated On 1 Nov 2023 9:11 PM GMT
Yagnik

Yagnik

Next Story