పారిస్ పారాలింపిక్స్‌లో భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేసి రెండు పతకాలు సాధించారు

పారిస్ పారాలింపిక్స్‌లో భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేసి రెండు పతకాలు సాధించారు. మహిళల సింగిల్స్ ఎస్‌యూ5 విభాగంలో తులసిమతి మురుగేశన్ రజత పతకాన్ని గెలుచుకోగా.. అదే విభాగంలో మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 11 పతకాలు సాధించింది. బ్యాడ్మింటన్‌లో దేశానికి మూడుపతకాలు వచ్చాయి. మురుగేశన్, మనీషా కంటే ముందు నితీష్ కుమార్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్ 3 విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు.

ముందుగా కాంస్య పతక పోరులో మనీషా 21-12, 21-8తో డెన్మార్క్‌కు చెందిన కేథరీన్ రోసెన్‌గ్రెన్‌ను ఏకపక్షంగా ఓడించింది. మురుగేసన్ ఫైనల్‌లో చైనాకు చెందిన యాంగ్ క్వి జియాతో తలపడింది. ఈ పోరులో 17-21, 10-21 తేడాతో ఓటమిని ఎదుర్కొని రజత పతకంతో సంతృప్తి చెందింది.

మ‌రో పోరులో రోసెన్‌గ్రెన్‌ను ఓడించడానికి 19 ఏళ్ల మనీషాకు కేవలం 25 నిమిషాల సమయం పట్టింది. మ్యాచ్ ఆద్యంతం తన ఆధిపత్యాన్ని కొనసాగించిన మనీషా ప్రత్యర్థి క్రీడాకారిణికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌లోనే ఆధిక్యంలోకి వెళ్లి 13 నిమిషాల్లోనే గేమ్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 12 నిమిషాల్లోనే రెండో గేమ్‌ను గెలిచి కాంస్యం సాధించింది. మనీషా సెమీ ఫైనల్‌లో మురుగేషన్ చేతిలో ఓడిపోయింది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story