Sai Sudharsan : కౌంటీల్లో సెంచరీ చేసిన శుభ్‌మాన్ గిల్ సహచరుడు
గుజరాత్ టైటాన్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ సహచరుడు సాయి సుదర్శన్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సర్రే తరఫున తన తొలి సెంచరీని సాధించాడు
గుజరాత్ టైటాన్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ సహచరుడు సాయి సుదర్శన్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సర్రే తరఫున తన తొలి సెంచరీని సాధించాడు. దీంతో సాయి సుదర్శన్.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి, కొత్త ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌కు కొత్త తలనొప్పిగా మారాడు. నాటింగ్‌హామ్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 6వ స్థానంలో బ్యాటింగ్ చేసిన సుదర్శన్ 178 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 105 పరుగులు చేశాడు. సుదర్శన్ బ్యాటింగ్ కారణంగా సర్రే మొదటి ఇన్నింగ్స్‌లో 525 పరుగులు చేసింది. సిక్స్ కొట్టి సుదర్శన్ ట్రిపుల్ డిజిట్ ఫిగర్‌ను తాకాడు.
సర్రే తరఫున కెప్టెన్ రోరీ బర్న్స్ 266 బంతుల్లో 161 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా.. ర్యాన్ పటేల్, విల్ జాక్వెస్, జోర్డాన్ క్లార్క్ హాఫ్ సెంచరీలను సాధించారు. ప్రత్యర్ధి నాటింగ్ హామ్ షైర్ బౌలర్లలో ఫర్హాన్ అహ్మద్ ఏడు వికెట్లు పడగొట్టాడు.
సర్రే తరఫున సాయి సుదర్శన్‌కి ఇది మూడో మ్యాచ్. అంతకుముందు 2023లో సర్రే కోచ్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి.. 22 ఏళ్ల సాయి సుదర్శన్‌ను ఈ కౌంటీ జట్టుతో ఒప్పందం కుదుర్చుకోవడంలో సహాయం చేశాడు. అయితే అతడు ఇన్నటివరకూ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అందులో 73 పరుగుల ఇన్నింగ్స్ కూడా ఆడాడు.
2023లోనే సుదర్శన్ దక్షిణాఫ్రికాపై తన ODI ఆరంగ్రేటం చేశాడు. ఆ సిరీస్‌లో అతడు రెండు అర్ధ సెంచరీలు చేశాడు. ఆ తర్వాత 2024లో జింబాబ్వే టూర్‌కు ఎంపికయ్యాడు. అక్కడ అతనికి బ్యాటింగ్‌కు అవకాశం రానప్పటికీ.. ఐపీఎల్ ద్వారా తనేంటో చూపాడు. తద్వారా ఇప్పటికే టీమిండియాలో ప్లేస్ కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్ల లిస్టులో.. స్థిరంగా రాణిస్తున్న సాయి సుదర్శన్ చేరాడు. దీంతో సెలక్టర్లకు సాయి సుదర్శన్ కొత్త తలనొప్పి అయ్యాడు.
ఇక వచ్చే వారం దులీప్ ట్రోఫీలో ఆడేందుకు సాయి సుదర్శన్ సిద్ధంగా ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమ్ సిలో సుదర్శన్ ఉన్నాడు. ఆకట్టుకునే ప్రదర్శన చేస్తే.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో జరగబోయే స్వదేశీ టెస్ట్ సిరీస్‌లకు జట్టులో సుదర్శన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.