ఐపీఎల్ 2024 ఎనిమిదో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది.

ఐపీఎల్ 2024 ఎనిమిదో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ముంబై ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన‌ హైదరాబాద్ ముంబైకి 278 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంత‌రం ముంబై 20 ఓవర్లలో 246/5 ​​పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసి 523 పరుగులు చేశాయి. ఇంతకు ముందు ఏ ఐపీఎల్ మ్యాచ్‌లోనూ 500 పరుగులు దాట‌లేదు.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బలమైన ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌ను 31 పరుగుల తేడాతో ఓడించింది. ఎన్నో రికార్డులు నమోదైన ఈ మ్యాచ్ ద్వారా హైదరాబాద్ తొలి విజయం న‌మోదు చేసుకుంది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో స‌న్‌రైజ‌ర్స్‌ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. హైద‌రాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా.. ముంబై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 246 పరుగులు చేయగలిగింది. ఈ విజయంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకోగా.. ముంబై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి తొమ్మిదో స్థానానికి చేరుకుంది.

హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజులోకి వ‌చ్చిన‌ ముంబైకి శుభారంభం లభించింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యాన్ని న‌మోదు చేయ‌గా.. ఈ జోడిని షాబాజ్ అహ్మద్ విడదీశాడు. 13 బంతుల్లో 34 పరుగులు చేసిన‌ ఇషాన్ కిషన్‌ను నాలుగో ఓవర్ రెండో బంతికి అవుట్ చేశాడు. ఆ త‌ర్వాత‌ రోహిత్ శర్మ కూడా ఐదో ఓవర్లో 26 పరుగులు చేసి వెనుదిరిగాడు. మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన నమన్ ధీర్‌ను కూడా ఆక‌ట్టుకున్నాడు. మూడో వికెట్‌కు తిలక్ వర్మతో కలిసి 84 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. 11వ ఓవర్లో జయదేవ్ ఉన‌ద్క‌త్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. 30 పరుగులు చేసి కమిన్స్ చేతికి చిక్కి నమన్ క్యాచ్ అవుట‌య్యాడు.

తిలక్ వర్మ 64 పరుగులు చేసి వెనుదిరిగాడు. అతను 188.23 స్ట్రైక్ రేట్‌తో రెండు ఫోర్లు, సిక్స్‌లు కొట్టాడు. ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా 20 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. టిమ్ డేవిడ్(42), రొమారియో షెపర్డ్(15) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాద్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్ రెండేసి వికెట్లు తీశారు. షాబాజ్ అహ్మద్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

అంత‌కుముందు హైద‌రాబాద్ జ‌ట్టులో ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత హెన్రిచ్ క్లాసెన్ 34 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఐడెన్ మార్క్రామ్ 28 బంతుల్లో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మార్క్రామ్ రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. క్లాసెన్, మార్క్రామ్ 55 బంతుల్లో 116 పరుగులు చేసి మ్యాచ్ గ‌తినే మార్చేశారు.

Updated On 27 March 2024 9:23 PM GMT
Yagnik

Yagnik

Next Story